Darren Sammy: త్వరలో టీమిండియాతో ప్రారంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో విండీస్ మాజీ సారధి డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తమ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని భారత్‌ను హెచ్చరించాడు. గతంలో చాలా సందర్భాల్లో టీమిండియా కంటే బలమైన జట్లకు షాకిచ్చామని, ఈ విషయాన్ని భారత్ గుర్తు చేసుకోవాలని సూచించాడు.
భారత్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా త్వరగా బయటపడగలదని, ప్రస్తుతం ఆ జట్టు రోహిత్ శర్మ లాంటి గొప్ప నాయకుడి చేతుల్లో సేఫ్‌గా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస ఓటములు, కెప్టెన్సీ వివాదం వంటివి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవని, స్వదేశంలో రోహిత్ సేన బెబ్బులిలా గర్జిస్తుందని తమ జట్టును అలర్ట్ చేశాడు.
ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లో పోలార్డ్ సేనకు ప్రధాన ముప్పు కెప్టెన్, మాజీ కెప్టెన్ల నుంచి ఉంటుందని హెచ్చరించాడు. రోహిత్ నేతృత్వంలో టీమిండియా బలంగా కనిపిస్తుందని, విండీస్ జట్టు సైతం ఆల్‌రౌండర్లతో నిండి ఉందని ప్రస్తావించాడు. విండీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం ఉందని, ముఖ్యంగా కెప్టెన్ పోలార్డ్‌కు భారత్‌లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, ఇది ఓ రకంగా తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణిస్తున్న కుర్రాళ్లు విండీస్‌కు అదనపు బలంగా మారతారని, యువకులు, అనుభవజ్ఞుల కలియకలో కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడుతూ.. సామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!
Comments
Please login to add a commentAdd a comment