రోహిత్‌ సాధన షురూ... | Rohit Sharma has started practicing with the team in full swing | Sakshi
Sakshi News home page

రోహిత్‌ సాధన షురూ...

Mar 18 2026 4:00 AM | Updated on Mar 18 2026 4:00 AM

Rohit Sharma has started practicing with the team in full swing

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెరో ఐదు టెటిల్స్‌తో అగ్ర స్థానంలో ఉన్నాయి. అయితే గత ఐదు సీజన్లలో ముంబై ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదు. 2020లో ట్రోఫీని అందుకున్న తర్వాత టీమ్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరడంలో విఫలమైన జట్టు... మిగిలిన రెండు సందర్భాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత జట్టుతో 2026లోనైనా జట్టు రాత మారుతుందా అనేది చూడాలి. 

ఈ నేపథ్యంలో ముంబై స్టార్‌ బ్యాటర్‌ మాజీ కెప్టెన్  రోహిత్‌ శర్మ పూర్తి స్థాయిలో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ చివరి సారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్‌లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్‌ పట్టి ఐపీఎల్‌ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. 

మంగళవారం సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. ముఖ్యంగా రోహిత్‌ గతంలో కంటే పూర్తి ఫిట్‌గా, చురుగ్గా కనిపిస్తుండటం విశేషం. 2025 సీజన్‌లో రోహిత్‌ 15 ఇన్నింగ్స్‌లలో 149.28 స్ట్రయిక్‌ రేట్‌తో 418 పరుగులు సాధించాడు. టీమ్‌ హెడ్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే పర్యవేక్షణలో జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement