Rohit Sharma: అశ్విన్‌పై రోహిత్‌ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్‌ ఆప్షన్‌.. | Rohit Sharma Praise Ashwin Comeback in T20Is Always Attacking Option | Sakshi
Sakshi News home page

Rohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్‌ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్‌ ఆప్షన్‌ అంటూ..

Published Mon, Nov 22 2021 1:42 PM | Last Updated on Mon, Nov 22 2021 8:28 PM

Rohit Sharma Praise Ashwin Comeback in T20Is Always Attacking Option - Sakshi

Rohit Sharma Praise Ashwin Comeback in T20Is Always Attacking Option: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా పర్యటన, స‍్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లలో అద్బుతంగా ఆకట్టుకున్నాడు అశ్‌. అయితే, ఇంగ్లండ్‌ టూర్‌లో మాత్రం అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా అశ్విన్‌కు టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.

దీంతో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌... మెగా టోర్నీలో 5.25 ఎకానమీతో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు ఈ తమిళనాడు స్పిన్నర్‌. వచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్న అశ్విన్‌ తొలి టీ20లో 2, రెండో టీ20లో ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి తన విలువేమిటో నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ రోహిత్ శర్మ అశ్విన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అటాకింగ్‌ చేయాలనుకున్న సమయాల్లో కెప్టెన్‌కు అశూ బెస్ట్‌ ఆప్షన్‌. అశ్విన్‌ లాంటి బౌలర్‌ జట్టులో ఉన్నట్లయితే... మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లోనే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడానికి, వికెట్లు పడగొట్టడానికి వీలు అవుతుంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అశ్విన్‌ పునరాగమనం ఎంతో సంతోషంగా ఉందన్న రోహిత్‌ శర్మ... తన అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. మూడో టీ20లో భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఈ విజయం అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు రెస్ట్‌ ఇచ్చారు.

చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement