టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్‌లో అడుగుపెట్టాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవాలన్న తన చిరకాల కోరిక తీరిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ క్రమంలో జట్టుతో కలిసి ట్రోఫీతో భారత్‌కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ విజయోత్సవాల్లో పాల్గొన్నాడు. ముంబైలో సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం సెలవు తీసుకున్న హిట్‌మ్యాన్.. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు. అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.
అయితే, కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చొరవతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు శ్రీలంక, ఇంగ్లండ్‌లతో మాత్రమే వన్డే సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో బరిలోకి దిగేందుకు రోహిత్ మొగ్గుచూపినట్లు తెలిసింది.
అందుకు అనుగుణంగానే శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని ప్రకటించింది. ఇక జూలై 27 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుండగా.. ఇప్పటికే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా వన్డే జట్టులోని పలువురు ఆటగాళ్లు లంకకు చేరుకున్నారు. గంభీర్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.
అయితే, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి మాత్రం ఇంకా శ్రీలంకలో అడుగుపెట్టలేదు. తాజాగా రోహిత్ తిరిగి రాగా.. కోహ్లి సైతం లండన్ నుంచి త్వరలోనే భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి శ్రీలంకకు వెళ్లి అక్కడి భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.
Cutiessss Back 💕🥹🤌✨..!!#RohitSharma𓃵 #RitikaSajdeh pic.twitter.com/IHLJWh6daN
— Neha_love._.45💌 (@NehaDubey187150) July 25, 2024
Comments
Please login to add a commentAdd a comment