
ముంబైలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ (PC: viralbhayani Instagram)
Rohit Sharma returns to India after vacation: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. భార్య రతికా సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి సోమవారం ముంబైలో అడుగుపెట్టాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ గెలవాలని రోహిత్ సేన ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన విషయం తెలిసిందే.
లీగ్ దశ నుంచి సెమీస్ వరకు వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై మాత్రం బోల్తా పడింది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రిక్తహస్తాలతో మిగిలిపోయింది. మరోవైపు.. భారత గడ్డపై టీమిండియాను ఓడించిన కంగారూ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించి సంబరాలు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నాడు. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని సరసన నిలవాలనుకున్న కల చెదిరిపోయినందుకు కన్నీటి పర్యంతమయ్యాడు.
హాలిడే ట్రిప్‌నకు లండన్ వెళ్లిన రోహిత్ శర్మ
ఈ క్రమంలో నవంబరు 19 నాటి ఫైనల్ తర్వాత సెలవులు తీసుకున్నాడు రోహిత్ శర్మ. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్‌నకు లండన్‌కు వెళ్లాడు. కొద్దిరోజుల పాటు కుటుంబంతో గడిపిన రోహిత్ సోమవారం భారత్‌కు తిరిగి వచ్చాడు. భార్య రితికాతో పాటు ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోహిత్ ఇంటికి పయనమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇందులో రోహిత్ తన గారాలపట్టి సమైరా శర్మను ఎత్తుకుని నడుస్తూ.. కార్లో కూర్చోపెట్టిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘కెప్టెన్ సాబ్ బెస్ట్ డాడీ’’ రోహిత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వరల్డ్‌కప్ తర్వాత.. స్వదేశంలో ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్.. సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదు.
అతడి గైర్హాజరీలో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించనున్నారు. టెస్టు సిరీస్ నాటికి మాత్రం రోహిత్ శర్మ జట్టుతో చేరతాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం అప్పుడే పునరాగమనం చేస్తాడు.
చదవండి: IND vs SA: మిషన్ సౌతాఫ్రికా.. మరో టీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా