డకౌట్ల మధ్య నాకౌట్‌ ఇన్నింగ్స్‌ | Rohit Sharma Stars as India Score 300 For 6 Against England | Sakshi
Sakshi News home page

డకౌట్ల మధ్య నాకౌట్‌ ఇన్నింగ్స్‌

Published Sun, Feb 14 2021 5:11 AM | Last Updated on Sun, Feb 14 2021 7:16 AM

Rohit Sharma Stars as India Score 300 For 6 Against England  - Sakshi

రహానే, కోహ్లి బౌల్డ్‌, రోహిత్‌ శర్మ

అనుకున్నట్లే పిచ్‌ మారింది. పూర్తిగా స్పిన్‌ వికెట్‌పై ఆట మొదలైంది. బంతి స్పిన్నర్ల చేతుల్లో గింగిర్లు తిరుగుతోంది. ఈ ఉచ్చులో గోడ (పుజారా) కూడా పడిపోయినా... సారథి కోహ్లి ఖాతానే తెరువలేకపోయినా... ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఏటికి ఎదురీదే ఇన్నింగ్స్‌తో నిలబడ్డాడు. పిచ్‌పై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా... తను మాత్రం వారి పాలిట సింహస్వప్నమయ్యాడు. చక్కని పోరాటంతో భారీ సెంచరీ సాధించాడు. రహానే అర్ధశతకంతో రోహిత్‌కు అండగా నిలిచాడు. బలమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దాంతో ఇంగ్లండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది.  స్పిన్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై భారత్‌ స్కోరు 400 పరుగులు దాటితే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

చెన్నై: పిచ్‌ స్వభావం, స్పిన్నర్ల రాజసం చూస్తుంటే ఈ మ్యాచ్‌ ఫలితానికి ఐదు రోజులు అక్కర్లేదేమో! తొలిరోజు ఆటను చూసిన వారెవరైనా ఇదే అంటారు. ఈ టెస్టూ చెపాక్‌లోనే జరుగుతున్నా... మ్యాచ్‌ అయితే స్పిన్నర్ల చేతిలోనే తిరుగుతుంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌ 300 పరుగులు చేయగలిగిందంటే... దానికి కారణం కచ్చితంగా ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (231 బంతుల్లో 161; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యద్భుత ఇన్నింగ్స్‌. ఏడాది తర్వాత మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులకు తనదైన శైలిలో, దూకుడుతో క్రికెట్‌ మజాను అందించాడు రోహిత్‌. వైస్‌ కెప్టెన్‌ రహానే (149 బంతుల్లో 67; 9 ఫోర్లు) కూడా బాధ్యత పంచుకోవడంతో కీలకమైన వికెట్లు పడినా భారత్‌ మంచి స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్‌ స్పిన్నర్లు జాక్‌ లీచ్‌ (2/78), మొయిన్‌ అలీ (2/112) భారత జోరుకు బ్రేకులేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చి హైదరాబాద్‌ సీమర్‌ సిరాజ్‌కు అవకాశమిచ్చారు. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను, షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌ జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. బెస్‌ స్థానంలో మొయిన్‌ అలీ, అండర్సన్‌ స్థానంలో బ్రాడ్, ఆర్చర్‌ స్థానంలో ఓలీ స్టోన్, కీపర్‌ బట్లర్‌ స్థానంలో బెన్‌ ఫోక్స్‌ వచ్చారు.  

టాస్‌ గెలిచింది... గిల్‌ వికెట్‌తో మొదలైంది!
స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగితే బంతిబంతికి సవాళ్లు ఎదురయ్యే ఈ పిచ్‌పై టాస్‌ గెలవడం భారత్‌కు కాస్త అనుకూలించింది. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టింది. కానీ భారత్‌ పరుగు కంటే ముందే వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (0) డకౌటయ్యాడు. దీంతో ఆట ఆరంభంలోనే పుజారా (58 బంతుల్లో 21; 2 ఫోర్లు) ‘హిట్‌మ్యాన్‌’కు జతయ్యాడు. ఇద్దరు 20 ఓవర్లదాకా మరో వికెట్‌ పడిపోకుండా జాగ్రత్తగా ఆడారు. రోహిత్‌ మాత్రం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఎదురుదాడి కూడా చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు సాఫీగా సాగిపోయింది. కానీ 21వ, 22వ ఓవర్లు భారత్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. మొదట లీచ్‌... మొండిగా ఆడే పుజారాను పెవిలియన్‌ చేర్చాడు. తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ కోహ్లి (0)ని మొయిన్‌ అలీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పిచ్‌పై పడిన బంతి అనూహ్యంగా వికెట్ల మీదికి దూసుకొచ్చి బెయిల్స్‌ను పడేసింది. ఇది అర్థంకాని కోహ్లి... ఔట్‌ కాదనుకొని రివ్యూకు వెళ్లాడు. మరుక్షణంలోనే పెద్ద తెరపై ‘ఔట్‌’ అని రావడంతో కెప్టెన్‌ నిష్క్రమించాడు. 106/3 స్కోరు వద్ద టీమిండియా బ్రేక్‌కు వెళ్లింది. లంచ్‌ సమయానికి భారత్‌ చేసిన స్కోరు లో రోహిత్‌వి 80 పరుగులు ఉండటం విశేషం.  
రోహిత్‌ శతకం
రెండో సెషన్‌లో రోహిత్‌తో పాటు రహానే కూడా క్రీజులో పాతుకుపోవడంతో అనుభవజ్ఞుల ఆట ముందు ఇంగ్లండ్‌ స్పిన్నర్ల ఆటలేం సాగలేదు. దూకుడుగా ఆడిన రోహిత్‌ 130 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఆ వెంటే జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. మరోవైపు రహానే నింపాదిగా ఆడాడు.  నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించాక జట్టు స్కోరు 189/3 వద్ద ‘టీ’విరామానికెళ్లారు.  

కట్టడి చేసిన స్పిన్నర్లు
రోహిత్‌ జోరు, రహానే నిలకడ ట్రీ బ్రేక్‌ తర్వాత కూడా కొనసాగింది. 58వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. ఆ వెంటనే రహానే కూడా తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్‌ శర్మ భారీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ జోడీ పర్యాటక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ క్రమంలోనే స్టార్‌ ఓపెనర్‌ 208 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరువైన దశలో రోహిత్‌ శర్మను స్పిన్నర్‌ లీచ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 162 పరుగుల నాలుగోవికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. పరుగు తేడాతో రహానే కూడా నిష్క్రమించడం భారత ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. అనంతరం పంత్, అశ్విన్‌ల ఆట మొదలైంది. వీరి భాగస్వామ్యం కుదుట పడకముందే రూట్‌ తన స్పిన్‌ బౌలింగ్‌తో అశ్విన్‌ (13) వికెట్‌ను పడేశాడు.  ఆట నిలిచే సమయానికి పంత్‌ (33 బ్యాటింగ్‌), అక్షర్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఇంగ్లండ్‌ బౌలర్లు ఒక్క పరుగును కూడా ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) మొయిన్‌ అలీ (బి) లీచ్‌ 161; శుబ్‌మన్‌ గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోన్‌ 0; చతేశ్వర్‌ పుజారా (సి) స్టోక్స్‌ (బి) లీచ్‌ 21; విరాట్‌ కోహ్లి (బి) మొయిన్‌ అలీ 0; అజింక్య రహానే (బి) మొయిన్‌ అలీ 67; రిషభ్‌ పంత్‌ (బ్యాటింగ్‌) 33; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) రూట్‌ 13; అక్షర్‌ పటేల్‌ (బ్యాటింగ్‌) 5; మొత్తం (88 ఓవర్లలో 6 వికెట్లకు) 300.
వికెట్ల పతనం: 1–0, 2–85, 3–86, 4–248, 5–249, 6–284.
బౌలింగ్‌: స్టువర్ట్‌ బ్రాడ్‌ 11–2–37–0, ఒలీ స్టోన్‌ 15–5–42–1; లీచ్‌ 26–2–78–2; స్టోక్స్‌ 2–0–16–0, మొయిన్‌ అలీ 26–3–112–2; రూట్‌ 8–2–15–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement