కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగారు.
107/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో నాలుగో రోజును ప్రారంభించిన బంగ్లాదేశ్.. అదనంగా 126 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్,అశ్విన్,ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు సాధించారు.
టీమిండియా వరల్డ్ రికార్డు..
అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి దూకుడు ధాటికి భారత్ స్కోర్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను అందుకుంది.
తద్వారా ఓ వరల్డ్ రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది.
ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి ఈ రికార్డు సాధించింది. తాజా మ్యాచ్‌తో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ సేన బ్రేక్ చేసింది.
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(37), రిషబ్ పంత్(4) పరుగులతో ఉన్నారు. అదేవిధంగా యశస్వీ జైశ్వాల్(51 బంతుల్లో 72, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ 23 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment