అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనం చేస్తారా? లేదంటే ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే అంతర్జాతీయ టీ20లలో వాళ్ల రీఎంట్రీ ఉంటుందా? ఒకవేళ అఫ్గన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నా.. ఐపీఎల్‌లో తమను తాము నిరూపించుకుని తిరిగి జట్టుతో చేరతారా?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో టీమిండియా సగటు అభిమానులను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ప్రశ్నలు ఇవి!! పొట్టి ఫార్మాట్లో 2022 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్ టీ20 కూడా ఆడలేదు.
హార్దిక్ పాండ్యా పేరు దాదాపుగా ఖరారు
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వివిధ సిరీస్‌లలో టీమిండియా టీ20 కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా పాండ్యా పేరు దాదాపుగా ఖాయమైపోగా.. సూర్య వైస్ కెప్టెన్ పదవిని దక్కించుకోవడం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సహా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, పీయూశ్ చావ్లా తదితరులు రోహిత్, కోహ్లిలాంటి సీనియర్లు లేకుండా టీ20 ప్రపంచకప్ బరిలో దిగితే జట్టుకు నష్టమేనని వాదిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించగల సత్తా ఇంకా వీరిలో మిగిలే ఉందని.. కాబట్టి విరాహిత్ ద్వయం సిద్ధంగా ఉంటే టీ20లలో కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎవరో ఒక్కరే రీఎంట్రీ?
ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉంటామని చెప్పిన రోహిత్- కోహ్లి ఇంకా ఈ విషయంపై స్పష్టతకు రాలేదన్నది దాని సారాంశం.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సైతం వీరిద్దరిలో ఎవరో ఒకరినే ఆడిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జట్టు కూర్పు విషయంలో ఎటూ తేల్చుకోకపోవడం వల్లే ఇంకా జట్టును ప్రకటించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా?
ఈ క్రమంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ జట్టులో రోహిత్, శుబ్‌మన్ గిల్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తమ టాప్-5 స్థానాలను నిలబెట్టుకుంటే.. లెఫ్టాండర్‌ను ఎక్కడ ఆడిస్తారు?
ఒకవేళ ఎడమ చేతి వాటం బ్యాటర్ కోసం కోహ్లిని తప్పించి.. అతడి స్థానంలో గిల్‌ను వన్‌డౌన్‌లో ఆడించి.. రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తే... ఎలా ఉంటుంది??.. అయితే, అజిత్ కోహ్లిని డ్రాప్ చేయగల సాహసం చేయగలడా??’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గాయాల కారణంగా హార్దిక్, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్ కెప్టెన్‌గా తిరిగి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉంటే ఇద్దరూ ఉంటారు.. లేదంటే ఇద్దరూ ఉండరు
కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వస్తే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ, ఫినిషర్‌గా రింకూ సింగ్ మాత్రం తన స్థానాలు నిలబెట్టుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా పూనుకుంటే తప్ప రోహిత్- కోహ్లి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.
అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కోహ్లి- రోహిత్‌లలో తీసుకుంటే ఇద్దరినీ తీసుకుంటారని.. లేదంటే ఇద్దరినీ డ్రాప్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఐపీఎల్-2024 ముగిసిన తర్వాతే వీరిద్దరు టీ20 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అన్నది తేలుతుందని జోస్యం చెబుతున్నారు. మరోవైపు.. టీమిండియాతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ 19 మంది సభ్యులతో జట్టును శనివారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment