‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్లు అయినా సరే ఖర్చుపెట్టబోతోంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో అతడికి ఇప్పటికే ఈ మేర భారీ ఆఫర్ కూడా ఇచ్చింది’’ అంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించాడు.
ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధం
ఇలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు అర్థం కావడం లేదని.. అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా ఖర్చు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్లన్నీ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. పదేళ్లపాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అనూహ్య రీతిలో వేటు
అయితే, గతేడాది ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆగమనంతో రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ముంబై యాజమాన్యం. దీంతో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోహిత్ శర్మ వేలంలోకి రానున్నాడని.. అతడి కోసం లక్నో, ఢిల్లీ తదితర జట్లు పోటీపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సంజీవ్ గోయెంకాకు ప్రశ్న ఎదురైంది.
‘‘రోహిత్ కోసం లక్నో రూ. 50 కోట్లు విడిగా పెట్టిందనే వదంతులు వస్తున్నాయి. ఇవి నిజమేనా?’’ అని యాంకర్ ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడో? లేదో మీరే చెప్పండి. ఈ విషయం గురించి ఎవరికైనా స్పష్టత ఉందా?
ఒక్కడి కోసం రూ. 50 కోట్లా?
ఇవన్నీ వట్టి వదంతులే. ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అదే జరిగి అతడు వేలంలోకి వచ్చినా.. సాలరీ పర్సులోని 50 శాతం డబ్బు ఒక్క ప్లేయర్ కోసమే ఎవరైనా ఖర్చు చేస్తారా? అలాంటపుడు మిగతా 22 ప్లేయర్ల సంగతేంటి?’’ అని సంజీవ్ గోయెంకా తిరిగి ప్రశ్నించాడు.
కోరుకుంటే సరిపోదు
ఈ క్రమంలో.. ‘‘రోహిత్ మీ విష్ లిస్ట్‌లో ఉన్నాడా?’’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరికి ఒక విష్ లిస్ట్ ఉంటుంది. అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్‌నే ఎవరైనా కోరుకుంటారు. అయితే, మనం ఏం ఆశిస్తున్నామనేది కాదు.. మనకు ఏది అందుబాటులో ఉంది.. మనం పొందగలిగేదన్న విషయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నేను కావాలనుకున్న వాళ్లను వేరే ఫ్రాంఛైజీ దక్కించుకోవచ్చు కదా!’’ అని సంజీవ్ గోయెంకా సమాధానం దాటవేశాడు.
చదవండి: ‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు’
గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడా?
Comments
Please login to add a commentAdd a comment