5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్‌కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు.
ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment