స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో సౌతాఫ్రికా ఎట్టకేలకు తొలి గెలుపు సాధించింది. 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రొటీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. తాజా గెలుపుతో ఆ జట్టు సిరీస్ అవకాశాలను (1-2) సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఎయిడెన్ మార్క్రమ్ విధ్వంసకర శతకంతో (74 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. డికాక్ (82), బవుమా (57)లు సైతం అర్ధసెంచరీలతో చెలరేగగా.. హెండ్రిక్స్ (39), జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. క్లాసెన్ (0), మిల్లర్ (8) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తీన్వర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఓ దశలో విజయం దిశగా సాగినప్పటికీ.. సఫారీ యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (4/50) ఆసీస్ విజయావకాశాలకు అడ్డుకట్ట వేశాడు. అతనికి తబ్రేజ్ షంషి (2/29), కేశవ్ మహారాజ్ (2/37), మగాల (1/40) సహకరించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్ (78) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు.
ట్రవిస్ హెడ్ (38), మిచెల్ మార్ష్ (29)లకు శుభారంభాలు లభించినప్పటికీ, వారు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. లబూషేన్ (15), అలెక్స్ క్యారీ (12), స్టోయినిస్ (10), టిమ్ డేవిడ్ (8), సీన్ అబాట్ (2), ఇల్లిస్ (16), తన్వీర్ సంగా (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లారు. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే సెప్టెంబర్ 15న సెంచూరియన్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment