దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్‌లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది.
అయితే అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్‌కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
గౌస్‌కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్‌రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు.
Comments
Please login to add a commentAdd a comment