సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఆటగాళ్లు వాన్ డర్ డస్సెన్, రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్బన్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్మట్స్ రెచ్చిపోయారు.
డస్సెన్ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్
జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్ లిండే, ఓలీ స్టోన్ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్, రబాడ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డు ప్లూయ్ (48), రొమారియో షెపర్డ్ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
చెలరేగిన పూరన్, స్మట్స్..
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో) నికోలస్ పూరన్ (31 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో టామ్ ఏబెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (55), మార్క్రమ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్మట్స్, ప్రిటోరియస్, గ్లీసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment