ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది.
ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది.
కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్..
డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment