లంకపై నమీబియా చారిత్రక విజయం.. పేరు గుర్తు పెట్టుకోవాలంటూ సచిన్‌ హెచ్చరిక | Sachin Tendulkar Hails Namibia Historic Win Against Sri Lanka At T20 World Cup With Tweet | Sakshi
Sakshi News home page

లంకపై నమీబియా చారిత్రక విజయం.. పేరు గుర్తు పెట్టుకోవాలంటూ సచిన్‌ హెచ్చరిక

Published Sun, Oct 16 2022 9:25 PM | Last Updated on Tue, Oct 25 2022 5:06 PM

Sachin Tendulkar Hails Namibia Historic Win Against Sri Lanka At T20 World Cup With Tweet - Sakshi

టీ20 ప్రపంచకప్ ఆరంభంలోనే పెను సంచలనం నమోదైంది. టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకపై పసికూన నమీబియా చారిత్రక విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ సంచలన విజయాలు సాధించి సూపర్‌-12కు అర్హత సాధించిన నమీబియా.. ఈసారి కూడా అదే తరహా ప్రదర్శనను రిపీట్‌ చేస్తుంది. తమ కంటే పటిష్టమైన జట్టుపై నమీబియా గెలుపు అనంతరం క్రికెట్‌ ప్రపంచం పసికూనలపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అభిమానులు, విశ్లేషకులు నమీబియాను ఆకాశానికెత్తుతున్నారు. 

ఈ క్రమంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా నమీబియా ప్రదర్శనను కొనియాడాడు. ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించాడు. పేరు గుర్తు పెట్టుకోండి (నామ్ యాద్ రఖ్నా).. ఈ రోజు నమీబియా క్రికెట్‌ ప్రపంచానికి తనేంటో రుజువు చేసిందంటూ టీమిండియాను పరోక్షంగా హెచ్చరించాడు. సచిన్‌ ట్విట్‌పై నమీబిమా కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ స్పందించాడు. పేరు గుర్తు పెట్టుకోండి అంటూ సచిన్‌ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఏలో జరిగిన తొలి మ్యాచ్‌లో నమీబియా.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్  ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖర్లో జాన్ ఫ్రైలింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్‌ ( 16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నమీబియా ఈ స్కోర్‌ సాధించగలిగింది.

అనంతరం ఛేదనలో నమీబియా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. డేవిడ్‌ వీస్‌ (2/16), బెర్నార్డ్‌ స్కోల్జ్‌ (2/18), బెన్‌ షికొంగో (2/22), జాన్‌ ఫ్రైలింక్‌ (2/26), స్మిట్‌ (1/16) మూకుమ్మడిగా లంక నడ్డి విడిచారు. ఫలితంగా ఆ జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షనక (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement