
తాను లంచం ఆఫర్ చేశానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ స్పందించాడు. వార్న్.. ఓ చేత కాని బౌలర్ అని, అప్పట్లో నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడని, ఆ కసితోనే నాపై ఫిక్సింగ్ ఆరోపణలకు పాల్పడ్డాడని కౌంటరిచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తమ పుస్తకావిష్కరణల సందర్భంగా వివాదాలు క్రికెట్ చేయడం అలవాటుగా మారిందని, ఈ వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీని వారు క్యాష్ చేసుకుంటున్నారని, వార్న్ కూడా అలాంటి చీప్ స్టంట్‌నే ప్లే చేశాడని ధ్వజమెత్తాడు.
వార్న్‌కు తాను లంచం ఆఫర్ చేసిన విషయం 26 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా, ఒక వేళ అదే నిజమైతే అతను ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించాడు. తన డ్యాక్యుమెంటరీని మార్కెట్ చేసుకోవడం కోసమే వార్న్ ఇదంతా చేస్తున్నాడని, అతని ఆరోపణల్లో ఇది తప్ప, మరో ఉద్దేశం కనిపించ లేదని, 26 ఏళ్లు గడిచినా వార్న్ నన్ను గుర్తుపెట్టుకోవడం సంతోషమేనని మాలిక్ చెప్పుకొచ్చాడు.
కాగా, తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా షేన్ వార్న్.. సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1994 పాక్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు సలీం మాలిక్.. తనకు 2,76,000 అమెరికన్ డాలర్ల లంచం ఆఫర్ చేశాడని వార్న్ ఆరోపించాడు. తనతో పాటు సహచర ఆటగాడు టిమ్ మేకు కూడా సలీం లంచం ఆఫర్ చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు