న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు పగ్గాలను సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ చేపట్టే అవకాశాలు ఉన్నాయని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాడిగా కొనసాగేందుకే మొగ్గుచూపే క్రమంలో ధోని కెప్టెన్సీ విధుల తప్పుకొని, ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగిస్తాడని భావిస్తున్నానన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే కొత్త కెప్టెన్ చూడబోతున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్- 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరం కావడం వంటి అంశాలు జట్టు వైఫల్యాలపై ప్రభావం చూపాయి. వరుస ఓటములు వెంటాడటంతో ధోని సేన ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా వెనుదిరిగింది. (చదవండి: వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!)
ఈ క్రమంలో కెప్టెన్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే మంచిదని, జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే సీఎస్‌కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ధోని కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలకు తెరపడలేదు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నాకు తెలిసినంత వరకు 2011 తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సమయంలో కెప్టెన్ క్యాండిడేట్ సిద్ధంగా లేనందు వల్లే ధోని సారథ్య బాధ్యతలు మోయక తప్పలేదు. ఆ తర్వాత సరైన సమయం చూసి విరాట్ కోహ్లికి జట్టు పగ్గాలు అందించాడు. ఆ తర్వాత ధోని ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా ధోని అదే తరహాలో ఆలోచిస్తాడనుకుంటున్నా. వచ్చే ఏడాది తను సీఎస్‌కే కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. డుప్లెసిస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పి తను ఆటగాడిగా కొనసాగుతాడేమో.
ఇప్పుడు వాళ్లకు డుప్లెసిస్ ఒక్కడే మెరుగైన ఆప్షన్. ఎందుకంటే అద్భుతంగా రాణించే ఆటగాడిని ఏ జట్టు వదులుకోదు. సీఎస్‌కు కెప్టెన్ అయ్యే స్థాయి ఉన్న వ్యక్తి అసలు వేలంలోకే రాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ ఏడాది ఆరంభంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అలాంటి వ్యక్తి ఐపీఎల్-2021 సీజన్‌లో ధోని నిజంగానే కెప్టెన్సీ వదులుకుంటే, ఆ బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా అన్నది చర్చనీయాంశం. ఇక గతంలో ధోని దమ్మున్న నాయకుడంటూ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అతనో అసాధారణ, ప్రత్యేకమైన నాయకుడంటూ మహీ నాయకత్వ లక్షణాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని చదవడంలో ధోని దిట్ట. మైదానంలో ఉన్నపళంగా తీసుకునే సరైన నిర్ణయాలే ధోనిని ప్రత్యేకంగా నిలిపాయి’’ అంటూ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment