Sanju Samson may be Replaced by Injured Pant to Bangladesh Tour 2022 - Sakshi
Sakshi News home page

Sanju Samson: బంగ్లా టూర్‌లో వన్డేలతో పాటు టెస్ట్‌ అరంగేట్రం కూడా..?

Published Thu, Dec 1 2022 3:43 PM | Last Updated on Thu, Dec 1 2022 4:53 PM

Sanju Samson May Be Replaced By Injured Pant To Bangladesh Tour 2022 - Sakshi

India Tour Of Bangladesh 2022: అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్‌, హిట్టింగ్‌ అన్నింటికీ మించి మంచి ఫామ్‌లో ఉన్నా, తమ ఫేవరెట్‌ క్రికెటర్‌కు ఛాన్స్‌లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెడుతున్న సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌ను ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. త్వరలో (డిసెంబర్‌ 4) ప్రారంభంకానున్న బంగ్లాదేశ్‌ టూర్‌లో శాం‍సన్‌.. వన్డేలతో పాటు టెస్ట్‌ అరంగేట్రం చేసేందుకు కూడా లైన్‌ క్లియర్‌ అయ్యిందని సమాచారం. బంగ్లా టూర్‌ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో (వన్డేలు, టెస్ట్‌లు) శాంసన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.

అయితే, తాజాగా ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఆఖరి వన్డే సందర్భంగా రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడటంతో అతని స్థానాన్ని సంజూతో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంజూకు సరైన అవకాశాలు ఇవ్వకుండా, పంత్‌ను అధిక ప్రాధాన్యత ​ఇస్తున్నారన్న అపవాదును చెరిపి వేసుకునేందుకైనా బీసీసీఐ బంగ్లా టూర్‌లో శాంసన్‌కు అవకాశం ఇస్తుందని విశ్లేషకులు, అభిమానులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు రిషబ్‌ పంత్‌ గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం‍ లేనప్పటికీ.. అతను తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మూడో వన్డేలో ఔటైన అనంతరం పంత్‌ స్ట్రెచర్‌పై పడుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్‌ గాయంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి మాట్లాడుతూ.. స్కానింగ్‌ రిపోర్ట్‌లో పంత్‌ గాయం తీవ్రతపై ఓ అవగాహన వచ్చిందని, అతనికి నెల నుంచి రెండు నెలల విరామం అవసరమని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారం నేపథ్యంలో బంగ్లా టూర్‌ నుంచి పంత్‌ ఔటయ్యాడని, ఆ టూర్‌లో తమ ఫేవరెట్‌ క్రికెటర్‌.. వన్డేలతో పాటు టెస్ట్‌ల్లో ఆడటం దాదాపుగా ఖాయమైందని సంజూ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకుంటున్నారు. సంజూకి జరిగిన అన్యాయానికి, వన్డేలతో పాటు టెస్ట్‌ అరంగేట్రం చేసే అవకాశం కూడా దొరికిందని ముచ్చటించుకుంటున్నారు.

కాగా, బంగ్లా టూర్‌ కోసం ఎంపిక చేసిన భారత రెండు జట్లలో (వన్డే, టెస్ట్‌) పంత్‌కు అవకాశం లభించిన విషయం తెలిసిందే. టెస్ట్‌ టీమ్‌లో అతనితో పాటు శ్రీకర్‌ భరత్‌, కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపర్లుగా ఎంపిక కాగా..  వన్డే స్క్వాడ్‌లో పంత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌లకు వికెట్‌కీపర్‌ కోటాలో చోటు దక్కింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా (పంత్‌ గైర్హాజరీలో) కేఎల్‌ రాహుల్‌, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌లతో పోలిస్తే.. జట్టు యాజమాన్యం సంజూ వైపే మొగ్గు చూపే అవకాశం​ ఉందని తెలుస్తోంది. 

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌- షెడ్యూల్‌
మొదటి వన్డే: డిసెంబరు 4- ఆదివారం- షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం- ఢాకా
రెండో వన్డే: డిసెంబరు 7- బుధవారం- షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం- ఢాకా
మూడో వన్డే: డిసెంబరు 10- శనివారం- షేర్‌- ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం- ఢాకా
భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆరంభం

జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్‌ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.

టెస్టు సిరీస్‌
తొలి టెస్టు డిసెంబరు 14- 18: జహూర్‌ అహ్మద్‌ చౌదరి స్టేడియం, చట్టోగ్రామ్‌
రెండో టెస్టు డిసెంబరు 22- 26: షేర్‌ ఏ బంగ్లా నేషనల్‌ స్టేడియం, ఢాకా
భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభం

జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్‌. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.

లైవ్‌ స్ట్రీమింగ్‌
భారత్‌లో- సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం
టీవీ బ్రాడ్‌కాస్టర్‌- సోనీ స్పోర్ట్స్‌ 3(హిందీ)
సోనీ స్పోర్ట్స్‌ 4(తమిళ్‌/తెలుగు)
సోనీ స్పోర్ట్స్‌ 5(ఇంగ్లిష్‌)  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement