డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ | Sarfaraz Khan Becomes Mumbai 1st Ever Double Centurion in Irani Cup Records | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Oct 2 2024 4:22 PM | Updated on Oct 2 2024 5:27 PM

Sarfaraz Khan Becomes Mumbai 1st Ever Double Centurion in Irani Cup Records

బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన టీమిండియా స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ దేశవాళీ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్‌ విసిరేలా ధనాధన్‌ డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్‌-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌
బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్‌ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సర్ఫరాజ్‌ ఖాన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

యంగెస్ట్‌ డబుల్‌ సెంచూరియన్స్‌
అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్‌ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్‌ యంగెస్ట్‌ డబుల్‌ సెంచూరియన్స్‌ లిస్టులో యశస్వి జైస్వాల్‌(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్‌ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ​(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఈసారి ముంబై వర్సెస్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
కాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్‌ తీసి డ్రెసింగ్‌ రూం వైపు బ్యాట్‌ చూపుతూ సర్ఫరాజ్‌ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్‌- రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్‌ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్‌గా నిలిచి.. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో తలపడుతోంది.

భారీ స్కోరు సాధించి
లక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్‌ మొదలైంది. ఇందులో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని టాస్‌ గెలిచిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ తన డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చదవండి: WTC: ఫైనల్‌ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement