Sarfaraz Khan: అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతూ, దేశవాలీ టోర్నీల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, పరుగుల వరద పారిస్తున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవలే మీడియాతో షేర్ చేసుకున్నాడు. తన కొడుకు సర్ఫరాజ్ ఖాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌తో కూడిన ఓ యధార్థ సన్నివేశాన్ని నౌషద్ మీడియాకు వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశంలో సర్ఫరాజ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నౌషద్ కన్నీరుమున్నీరయ్యాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే (నౌషద్ కథనం మేరకు).. సర్ఫరాజ్ ఖాన్, సచిన్ తనయుడు అర్జున్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున కలిసి క్రికెట్ ఆడేవారు. ఒక రోజు సర్ఫరాజ్ తన తండ్రి నౌషద్ దగ్గరకు వచ్చి.. నాన్న.. అర్జున్ ఎంత అదృష్టవంతుడు కదా.. అతని దగ్గర కార్లు, ఐపాడ్స్ అన్నీ ఉన్నాయి అని అన్నాడు. కొడుకు అన్న మాటలకు నౌషద్ నోటి వెంట మాట రాలేదు. నిస్సహాయ స్థితిలో అలాగే మిన్నకుండిపోయాడు. తమ ఆర్థిక స్థోమత గురించి కొడుకుకు తెలుసో లేదో అని మనసులో అనుకున్నాడు.
కొద్దిసేపటికి సర్ఫరాజ్ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని.. అర్జున్ కంటే నేనే అదృష్టవంతున్ని నాన్న.. ఎందుకంటే, నా తండ్రి నాతో పాటు రోజంతా గడుపుతాడు, అర్జున్ తండ్రి అతనితో ఎక్కువ సేపు గడపలేడు అంటూ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. ఈ విషయాన్ని నౌషద్ ఓ ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నాడు. చిన్నతనం నుంచి తన కొడుకుకు ఉన్న పరిపక్వత గురించి వివరిస్తూ నౌషద్ తెగ మురిసిపోయాడు. తన కొడుకు తిరిగి వచ్చి తనను కౌగిలించుకున్న క్షణంలో తనకు ఏమని మాట్లాడాలో అర్ధం కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు.
దిగువ మధ్య తరగతికి చెందిన నౌషద్.. కొడుకు సర్ఫరాజ్ కోసం చాలా త్యాగాలు చేశాడు. వర్షం పడితే గ్రౌండ్‌ను వెళ్లడం కుదరదని, ఇంటినే గ్రౌండ్‌గా మార్చేశాడు. క్రికెట్‌కు సంబంధించి కొడుకుకు కావాల్సిన సలహాలు ఇస్తూ అన్నీ తానై వ్యవహరిస్తుంటాడు.
ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్‌లోనూ 6 మ్యాచ్‌ల్లో 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తాజా ప్రదర్శన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో (ఆసీస్ సిరీస్) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించారు. అయితే ఈ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది.
గత 24 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162, 125, 0 ఓ ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు.
అయితే సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ గాయపడ్డాడు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్ కూడా ఉన్నాడు. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి అయ్యర్ కోలుకోకపోతే సర్ఫరాజ్‌కు టీమిండియా నుంచి మెయిడిన్ కాల్ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment