యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్‌లకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది.
పలుమార్లు ఆధిక్యం దోబూచులాడింది. 11–12తో వెనుకబడిన దశలో భారత జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి 14–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ ఆరంభంలోనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి శుభారంభం చేసింది. స్కోరు 10–8 వద్ద భారత జోడీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14–8తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 11–21, 14–21తో రెండో సీడ్ బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 15–21, 12–21తో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది.
భారత నంబర్‌వన్ హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 15–21, 21–19, 18–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యిక్ (హాంకాంగ్) చేతిలో... ప్రియాన్షు 14–21, 21–18, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment