టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్ జహాన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్ జహాన్ పిటిషన్‌పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఏళ్లకు ఏళ్లు ఈ కేసును సాగదీయడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ గృహహింస కేసు పెట్టిన హసీన్ జహాన్.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. కాగా షమీపై హసీన్ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 2019, ఆగష్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన షమీ సెప్టెంబరు 9న తన అరెస్టుపై స్టే విధించాల్సిందిగా కోరాడు. అదే విధంగా తనపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హసీన్ ఈ విషయమై హైకోర్టును సంప్రదించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఇక ఇదంతా జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ కేసు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే స్టే ఆర్డర్‌లో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు జడ్జిని ఆదేశించింది.
చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment