సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఓ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన బోలాండ్ టెస్ట్‌ల్లో 50 వికెట్ల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బోలాండ్ 35 ఏళ్ల 267 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ కాంగ్‌డాన్ 37 ఏళ్ల 10 రోజుల వయసులో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ 50వ టెస్ట్ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో బోలాండ్ జోష్ హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఈ సిరీస్‌లో బోలాండ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 15.46 సగటున 15 వికెట్లు పడగొట్టాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ టెస్ట్‌లో బోలాండ్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బీజీటీలో బోలాండ్ ఐదో లీడింగ్ వికెట్‌టేకర్‌గా ఉన్నాడు. బోలాండ్ తన టెస్ట్ కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.
సిడ్నీ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఓ వికెట్ తీసి టీమిండియా భరతం పట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రవీంద్ర జడేజా 26, జస్ప్రీత్ బుమ్రా 22, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 17, వాషింగ్టన్ సుందర్ 14, యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, నితీశ్‌కుమార్ రెడ్డి 0, ప్రసిద్ద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (2) తొలి రోజు ఆటలో చివరి బంతికి ఔటయ్యాడు. సామ్ కొన్‌స్టాస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment