చెన్నై: ఇన్నాళ్లు కరోనా భయంతో క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా కావడం.. రద్దవడం జరిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి పోటీలు మొదలవుతున్నాయి. అయితే క్రీడా పోటీలు ప్రారంభమైనా ప్రేక్షకులు చూసే అనుమతి లేకపోవడంతో ఇంట్లో కూర్చునే వీక్షించారు. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులు నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతినిస్తూ బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకున్నాయి. అయితే కేవలం 50 శాతం మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు.
ఇటీవల క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరిగే రెండో టెస్టుకు 50శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేడియంలోకి ఫ్యాన్స్‌ను అనుమతించే విషయంపై అసోసియేషన్ సభ్యులు బీసీసీఐ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. దీంతోపాటు మ్యాచ్ కవరేజీకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించనున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ నిర్ణయంపై తమిళనాడు క్రికెట్ సంఘానికి ఓ చెందిన ఓ ప్రతినిధి స్పందించి మీడియాతో మాట్లాడారు. 'క్రీడా వేదికల్లో ప్రేక్షకులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అంశంపై చర్చించాం. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదివారం ఎస్‌ఓపీలు విడుదల చేసింది' అని తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియంలో మొత్తం సామర్థ్యం 50,000 ఉండగా వారిలో 25 వేల మందిని అనుమతించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5వ తేది నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్‌లో జరగాల్సిన మూడు, నాలుగు టెస్టులకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment