అదరగొట్టిన రోహిత్‌ | IND Vs AFG: Second Win In A Row For Team India In CWC 2023, Ceck Match Highlights And Score Details Inside - Sakshi
Sakshi News home page

IND Vs AFG Match Highlights: అదరగొట్టిన రోహిత్‌

Published Thu, Oct 12 2023 4:26 AM | Last Updated on Thu, Oct 12 2023 3:36 PM

Second win in a row for India - Sakshi

వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఇప్పటికే తన పేరును లిఖించుకున్న రోహిత్‌ శర్మ ఇప్పుడు మరో మెట్టు ఎక్కాడు. టోరీ్నలో ఏడో శతకం సాధించిన తొలి ఆటగాడిగా శిఖరాన నిలుస్తూ మెరుపు ప్రదర్శనతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో డకౌట్‌ అయిన కసినంతా చూపిస్తూ అఫ్గానిస్తాన్‌పై అతను చెలరేగాడు.

ఈ క్రమంలో తన స్థాయిని ప్రదర్శిస్తూ పలు రికార్డులను అధిగమించాడు. దాంతో రోహిత్‌ ధాటికి అఫ్గాన్‌ విలవిల్లాడింది. మెరుగైన స్కోరు సాధించామన్న ఆ జట్టు సంబరం కాస్తా రోహిత్‌ ఆట ముందు ఆవిరైంది. రోహిత్‌ ఆటతో సులువుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్‌ లక్ష్యం చేరింది. ఇక శనివారం జరిగే అసలు పోరులో పాకిస్తాన్‌ను పడగొట్టేందుకు టీమిండియా సిద్ధమైంది.   

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ తొలి పోరులో పటిష్ట ఆ్రస్టేలియాను ఓడించిన భారత్‌ రెండో పోరులో చిన్న టీమ్‌ అఫ్గానిస్తాన్‌పై చెలరేగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను ఏకంగా 15 ఓవర్లు మిగిలి ఉండగానే ముగించి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెపె్టన్‌ హష్మతుల్లా షాహిది (88 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (69 బంతుల్లో 62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా నాలుగు వికెట్లతో, హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. అనంతరం భారత్‌ 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు సాధించి గెలిచింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, విరాట్‌ కోహ్లి (56 బంతుల్లో 55 నాటౌట్‌; 6 ఫోర్లు) మరో అర్ధ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లూ గెలిచిన టీమిండియా శనివారం అహ్మదాబాద్‌లో జరిగే తమ తర్వాతి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది.  

సెంచరీ భాగస్వామ్యం... 
బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై అఫ్గానిస్తాన్‌ చెప్పుకోదగ్గ స్కోరే సాధించగలిగినా... కీలక సమయాల్లో భారత బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు ఆశించినన్ని పరుగులు రాబట్టడంలో విఫలమైంది. 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు తొలి 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే హష్మతుల్లా, అజ్మతుల్లా కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.

21.2 ఓవర్లపాటు భారత్‌కు వికెట్‌ ఇవ్వకుండా నిలువరించడంలో సఫలమైన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 121 పరుగులు జత చేశారు. అయితే రన్‌రేట్‌ పేలవంగా సాగడంతో అది చివర్లో జట్టు స్కోరుపై ప్రభావం చూపించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ మినహా అంతా మెరుగైన ప్రదర్శనే చేశారు. ఓవర్‌కు 8.44 చొప్పున పరుగులిచ్చిన సిరాజ్‌ బౌలింగ్‌లో అఫ్గాన్‌ బ్యాటర్లు 12 ఫోర్లు, 1 సిక్స్‌ రాబట్టారు.  

ఎదురులేని బ్యాటింగ్‌తో... 
తనదైన శైలిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన రోహిత్‌ సునాయాసంగా అఫ్గాన్‌ నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఫజల్‌ ఓవర్లో సిక్సర్‌తో వరల్డ్‌ కప్‌లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్, అతని తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, 6 బాది 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. తర్వాతి రెండు ఓవర్లలో రోహిత్‌ మరో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 94 పరుగులకు చేరింది.

ముజీబ్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతనికి సెంచరీ పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 18వ ఓవర్‌ రెండో బంతికే రోహిత్‌ శతకం పూర్తి కావడం విశేషం. మరో ఎండ్‌లో రోహిత్‌కు సహకరించిన ఇషాన్‌ కిషన్‌ (47 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ తీసి భారీ భాగస్వామ్యం తర్వాత అఫ్గాన్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. తొలి వికెట్‌కు రోహిత్, కిషన్‌ 156 పరుగులు జత చేశారు. ఆ తర్వాత జత కలిసిన కోహ్లి ప్రశాంతంగా ఆడుకుంటూ పోయాడు.

రషీద్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన భారత కెపె్టన్‌ అతని తర్వాతి ఓవర్లో స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్‌ కావడంతో ఒక గొప్ప ఇన్నింగ్స్‌ ముగిసింది. విజయానికి 64 పరుగులు కావాల్సిన ఈ దశలో జత కలిసిన కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ (23 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి ఆట ముగించారు.  

7 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ సెంచరీల సంఖ్య. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచిన అతను సచిన్‌ టెండూల్కర్‌ (6) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. 2015 ప్రపంచకప్‌లో ఒక సెంచరీ చేసిన రోహిత్, 2019 వరల్డ్‌కప్‌లో 5 శతకాలు బాదాడు.  

556 అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) రోహిత్‌ సిక్సర్ల సంఖ్య. గేల్‌ (553) రికార్డు అధిగమించాడు.  

63 సెంచరీకి రోహిత్‌ తీసుకున్న బంతుల సంఖ్య. వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీగా గతంలో కపిల్‌ దేవ్‌ (72 బంతులు; 1983లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు.  

31 వన్డేల్లో రోహిత్‌ సెంచరీల సంఖ్య. రికీ పాంటింగ్‌ (30)ను అతను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్‌ (49), కోహ్లి (47) మాత్రమే ముందున్నారు.  

19 వరల్డ్‌కప్‌లో 19 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన డేవిడ్‌ వార్నర్‌ (19) రికార్డును రోహిత్‌ సమం చేశాడు.   

16 ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో అఫ్గానిస్తాన్‌ ఓడిన మ్యాచ్‌ల సంఖ్య. మూడో ప్రపంచకప్‌ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ 17 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది. 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై అఫ్గానిస్తాన్‌ ఒక వికెట్‌ తేడాతో నెగ్గింది.   

స్కోరు వివరాలు 
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) శార్దుల్‌ (బి) పాండ్యా 21; ఇబ్రహీమ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 22; రహమత్‌ (ఎల్బీ) (బి) శార్దుల్‌ 16; హష్మతుల్లా (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 80; అజ్మతుల్లా (బి) పాండ్యా 62; నబీ (ఎల్బీ) (బి) బుమ్రా 19; నజీబుల్లా (సి) కోహ్లి (బి) బుమ్రా 2; రషీద్‌ ఖాన్‌ (సి) కుల్దీప్‌ (బి) బుమ్రా 16; ముజీబ్‌ (నాటౌట్‌) 10; నవీన్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–32, 2–63, 3–63, 4–184, 5–225, 6–229, 7–235, 8–261. బౌలింగ్‌: బుమ్రా 10–0–39–4, సిరాజ్‌ 9–0–76–0, హార్దిక్‌ పాండ్యా 7–0–43–2, శార్దుల్‌ ఠాకూర్‌ 6–0–31–1, కుల్దీప్‌ యాదవ్‌ 10–0–40–1, రవీంద్ర జడేజా 8–0–38–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) రషీద్‌ 131; ఇషాన్‌ కిషన్‌ (సి) ఇబ్రహీమ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 47; కోహ్లి (నాటౌట్‌) 55; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–156, 2–205. బౌలింగ్‌: ఫారుఖీ 6–0–50–0, ముజీబ్‌ 8–0–64–0, నవీన్‌ ఉల్‌ హక్‌ 5–0–31–0, అజ్మతుల్లా 4–0–34–0, నబీ 4–0–32–0, రషీద్‌ 8–0–57–2.  

ప్రపంచకప్‌లో నేడు
ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా  
వేదిక: లక్నో 
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement