సాహో సెరెనా | Serena Williams Entered Into Quarter Finals In US Open | Sakshi
Sakshi News home page

సాహో సెరెనా

Published Mon, Sep 7 2020 2:35 AM | Last Updated on Mon, Sep 7 2020 5:41 AM

Serena Williams Entered Into Quarter Finals In US Open - Sakshi

తొలి రెండు రౌండ్‌లలో అనామక ప్రత్యర్థులు ఎదురవ్వడంతో అమెరికా మహిళా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ సత్తాకు ఏమంత పరీక్ష ఎదురుకాలేదు. కానీ మూడో రౌండ్‌లో యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ రూపంలో సెరెనాకు అసలు సిసలు సవాల్‌ వచ్చి పడింది. అమెరికా టెన్నిస్‌ భావితారగా భావిస్తున్న స్లోన్‌ స్టీఫెన్స్‌కు గతంలో తనను ఓడించిన రికార్డు కూడా ఉండటం... ఊహించని విధంగా సెరెనా తొలి సెట్‌ కూడా కోల్పోవడం... వెరసి సెరెనా 24వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ వేటకు మళ్లీ బ్రేక్‌ పడుతుందా అనే సందేహం కలిగింది. కానీ ఒక్క యూఎస్‌ ఓపెన్‌లోనే ‘శతక’ విజయాలు నమోదు చేసిన సెరెనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లను నెగ్గి స్లోన్‌ స్టీఫెన్స్‌ ఆట కట్టించిన సెరెనా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  

న్యూయార్క్‌: ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు... గతంలో వచ్చిన నాలుగు అవకాశాలను వృథా చేసుకున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఈసారి మాత్రం ఎలాగైనా తన లక్ష్యాన్ని అందుకునే దిశగా పట్టుదలతో ముందుకు సాగుతోంది. తనకెంతో కలిసొచ్చిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా 20వ సారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ సెరెనా 2–6, 6–2, 6–2తో 26వ సీడ్, 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై కష్టపడి  విజయం సాధించింది.

గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 23 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 2015 తర్వాత మళ్లీ స్లోన్‌ స్టీఫెన్స్‌తో తలపడిన సెరెనాకు తొలి సెట్‌లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 15వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌)తో సెరెనా తలపడుతుంది.  ఇతర మ్యాచ్‌ల్లో అజరెంకా 6–4, 6–2తో ఇగా షియాటెక్‌ (పోలాండ్‌)పై, పిరన్‌కోవా 6–4, 6–1తో 18వ సీడ్‌ డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై, అలీజి కార్నె 7–6 (7/4), 6–2తో ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై, సోఫియా కెనిన్‌ 7–6 (7/4), 6–3తో ఆన్స్‌ జెబుర్‌ (ట్యూనిషియా)పై, మెర్‌టెన్స్‌ 7–5, 6–1తో కేథరిన్‌ మెక్‌నాలీ (అమెరికా)పై, ముకోవా 6–4, 2–6, 7–6 (9/7)తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచారు.  

అగుట్, ఖచనోవ్‌ ఇంటిముఖం
పురుషుల సింగిల్స్‌లో సీడెడ్‌ క్రీడాకారుల నిష్క్రమ ణ కొనసాగుతోంది. 8వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌), 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. 94వ ర్యాంకర్‌ వాసెక్‌ పోస్పిసిల్‌ (కెనడా) 7–5, 2–6, 4–6, 6–3, 6–2తో బాటిస్టా అగుట్‌ను... 28వ ర్యాంకర్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా) 6–4, 0–6, 4–6, 6–3, 6–1తో ఖచనోవ్‌ను ఓడించారు. 

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట... 
పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 4–6, 6–4, 6–3తో ఆరో సీడ్‌ కెవిన్‌ క్రావిట్జ్‌–ఆండ్రీస్‌ మీస్‌ (జర్మనీ) జోడీని ఓడించింది.  

వైదొలిగిన మ్లాడెనోవిచ్‌ జంట 
మహిళల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)–తిమియా బాబోస్‌ (హంగేరి) జంట టోర్నీ మధ్యలో  వైదొలిగింది. టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా సోకిన పెయిర్‌ (ఫ్రాన్స్‌)  ప్రైమరీ కాంటాక్ట్‌ జాబితాలో మ్లాడెనోవిచ్‌ ఉండటమే దీనికి కారణం. పెయిర్‌తో కాంటాక్ట్‌ ఉన్న వాళ్లందరికీ న్యూయార్క్‌ సిటీ ఆరోగ్య విభాగం ఐసోలేషన్‌లోకి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది.

క్వార్టర్‌ ఫైనల్లో జెనిఫర్‌ బ్రేడీ 
మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన 28వ సీడ్‌ క్రీడాకారిణి జెనిఫర్‌ బ్రేడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రేడీ 6–1, 6–4తో 2016 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బ్రేడీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement