తన కోపమే తన శత్రువు | Disqualification On Novak Djokovic At US Open | Sakshi
Sakshi News home page

తన కోపమే తన శత్రువు

Published Tue, Sep 8 2020 2:31 AM | Last Updated on Tue, Sep 8 2020 2:36 AM

Disqualification On Novak Djokovic At US Open - Sakshi

చైర్‌ అంపైర్‌కు వివరణ

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండకపోతే... భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకోలేకపోతే... ఒక్కోసారి క్షణాల్లో అంతా తారుమారు అవుతుంది. తన కోపమే తనకు శత్రువు అవుతుంది. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, 17 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ విషయంలో అదే జరిగింది. లిప్తపాటులో చేసిన పొరపాటు అతడిపై అనర్హత వేటు పడేలా చేసింది. తనకు గట్టిపోటీనిచ్చి ఓడించే సత్తాగల మేటి ప్రత్యర్థులు, మాజీ యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్స్‌ రాఫెల్‌ నాదల్, ఫెడరర్, వావ్రింకా, డెల్‌పొట్రో టోర్నీకి దూరంగా ఉన్నా... బరిలో ఉన్న వారిలో ఎవరూ జొకోవిచ్‌ను కచ్చితంగా ఓడిస్తారనే నమ్మకం లేకపోయినా... ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా జొకోవిచ్‌ స్వయంకృతంతో తనను తానే ఓడించుకొని టోర్నీ నుంచి అనూహ్య పరిణామాల నడుమ భారంగా నిష్క్రమించాడు.

న్యూయార్క్‌: అంతర్జాతీయ టెన్నిస్‌లో 17 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ ... 17 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ... ఎన్నోసార్లు ఓటమి అంచులదాకా వెళ్లి వెంటనే కోలుకొని మ్యాచ్‌ల్లో నెగ్గిన సందర్భాలు ఉన్నప్పటికీ... జొకోవిచ్‌ విషయంలో ఆదివారం అవేవీ పనిచేయలేదు. కోపాన్ని నియంత్రించుకోలేక స్వయంకృతంతో యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  
అసలేం జరిగింది...
ప్రపంచ 29వ ర్యాంకర్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌)తో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ తనను తాను ఓడించుకున్నాడు. తొలి సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉండి, కరెనో బుస్టా సర్వీస్‌లో 40–0తో ముందంజ వేసి మూడు సెట్‌ పాయింట్లను జొకోవిచ్‌ సంపాదించాడు. కానీ కరెనో బుస్టా వరుస పాయింట్లు గెలిచి తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత 11వ గేమ్‌లో జొకోవిచ్‌ తన సర్వీస్‌ను కోల్పోయాడు. ఒకదశలో వరుసగా మూడు సెట్‌ పాయింట్లు గెల్చుకునే స్థితి నుంచి 5–6తో వెనుకబడి సెట్‌నే చేజార్చుకునే స్థితికి వచ్చాడు. 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను చేజార్చుకున్న వెంటనే జొకోవిచ్‌ అసహనానికి గురయ్యాడు. కోపంలో తన వద్ద అదనంగా ఉన్న బంతిని రాకెట్‌తో వెనక్కి కొట్టడం... అదీకాస్తా అక్కడే నిల్చోని లైన్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళ గొంతుకు బలంగా తాకడం... ఆమె నొప్పి భరించలేక అక్కడే కుప్పకూలిపోవడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

జొకోవిచ్‌ ఆ మహిళా లైన్‌ జడ్జి దగ్గరకు వెళ్లి పరామర్శించినా... ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని 10 నిమిషాలపాటు టోర్నమెంట్‌ రిఫరీ సోరెన్‌ ఫ్రీమెల్, గ్రాండ్‌స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రెస్‌ ఇగిలి, చైర్‌ అంపైర్‌ అరులీ టూర్టీలతో మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నిర్వాహకులు జొకోవిచ్‌ వాదనతో ఏకీభవించకుండా... ఎంతటి వారికైనా నిబంధనలు ఒకేలా ఉంటాయని, తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష పడాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. జొకోవిచ్‌పై అనర్హత వేటు వేశారు. దాంతో కరెనో బుస్టా విజయం ఖాయమై అతను క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. అనర్హత వేటు కారణంగా జొకోవిచ్‌ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయినందుకుగాను జొకోవిచ్‌కు రావాల్సిన 2,50,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 83 లక్షలు), 180 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కకుండా పోయాయి. ‘గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం ఏ క్రీడాకారుడైనా కోర్టులో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినా... నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టులో బంతితో ఎవరినైనా కొట్టినా అతనిపై అనర్హత వేటు వేస్తారు. ఈ నిబంధనల ప్రకారమే జొకోవిచ్‌పై చర్య తీసుకున్నాం’ అని యునైటెడ్‌ స్టేట్స్‌ టెన్నిస్‌ సంఘం వివరించింది. 

నన్ను క్షమించండి... 
నిర్వాహకులు డిస్‌క్వాలిఫై నిర్ణయం ప్రకటించిన వెంటనే తన ప్రత్యర్థి కరెనో బుస్టాతో కరచాలనం చేసి జొకోవిచ్‌ కోర్టు నుంచి వెళ్లిపోయాడు. మీడియా సమావేశానికి కూడా హాజరుకాలేదు. అయితే తన చర్యపట్ల క్షమాపణలు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. ‘ఈ మొత్తం సంఘటన నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. బంతి తగిలిన వెంటనే లైన్‌ జడ్జి వద్దకు ఆమెను పరామర్శించాను. దేవుడి దయతో ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాను. నా చర్యతో ఆమెకు భాధ కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. అనర్హత వేటు విషయానికొస్తే భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా, మంచి మనిషిగా మారేందుకు దీనినో గుణపాఠంగా భావిస్తాను. నా ప్రవర్తన పట్ల ఇబ్బంది కలిగించినందుకు నాతో సంబంధం ఉన్న వారందరికీ, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నాడు.
అనర్హత వేటుతో కోర్టు వీడుతూ...

గతంలోనూ ఇలా జరిగాయి... 
టెన్నిస్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనర్హతకు గురైన సంఘటనలు గతంలోనూ జరిగాయి. 1990లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జాన్‌ మెకన్రో (అమెరికా), 1995 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అరియన్స్‌ (జర్మనీ), 1995 వింబుల్డన్‌ టోర్నీలో జెఫ్‌ టరాంగో (అమెరికా), 1995 వింబుల్డన్‌ టోర్నీలో టిమ్‌ హెన్మన్‌ (బ్రిటన్‌), 2000 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్టీఫెన్‌ కౌబెక్‌ (ఆస్ట్రియా), 2017 డేవిస్‌కప్‌ మ్యాచ్‌లో షపోవలోవ్‌ (కెనడా) అనర్హతకు గురయ్యారు.

క్వార్టర్‌ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో మూడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సెరెనా 2 గంటల 27 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–3తో 15వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌)పై గెలిచింది. మరోవైపు ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఎనిమిదో సీడ్‌ పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓటమి చవిచూశారు. పుతింత్‌సెవా (కజకిస్తాన్‌) 6–3, 2–6, 6–4తో మార్టిక్‌ను... షెల్బీ రోజర్స్‌ (అమెరికా) 7–6 (7/5), 3–6, 7–6 (8/6)తో క్విటోవాను ఓడించారు.
బాధలో ఉన్న లైన్‌ జడ్జికి జొకోవిచ్‌ పరామర్శ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement