
లాహోర్: అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన షాహిద్ ఆఫ్రిది...18 ఏళ్ల పాటు ఆ రికార్డును తనపేరే నిలుపుకున్నాడు. 1996లో నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 ఏళ్ల వయస్సులో పాక్ మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. అయితే ఈ అద్బుత ప్రదర్శన వెనక భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత్ర కూడా ఉందని ఆఫ్రిది సహచరుడు అజహర్ మహమూద్ తాజాగా వెల్లడించాడు. నాటి మ్యాచ్‌లో సచిన్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆఫ్రిది 37 బంతుల్లో శతకం సాధించాడని అజహర్ తెలిపాడు.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమూద్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘1996లో ఆఫ్రిది అరంగేట్రం చేశాడు. ముస్తాక్ అహ్మద్ గాయపడటంతో పాకిస్తాన్ ‘ఎ’ పర్యటనలో ఉన్న ఆఫ్రిదికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. రెండో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన అతను 40 బంతుల్లో 104 పరుగులతో పతాక శీర్షికలెక్కాడు. ఆ మ్యాచ్‌లో అతను వాడిన బ్యాట్‌ను సచిన్ వకార్‌కిచ్చాడు. వకార్ నుంచి ఆ బ్యాట్ ఆఫ్రిది చేతికందింది. అంతకుముందు బౌలర్‌గానే గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్రిది... అలా సచిన్ బ్యాట్‌తో డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా మారాడు’ అని అజహర్ వివరించాడు.