రోహిత్ శర్మతో కోహ్లి (ఫైల్ ఫొటో)
Ind vs Eng Test Series 2024- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లేకుండానే భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టులు జరగడం ఒకరకంగా సిరీస్‌కే అవమానం లాంటిదని వ్యాఖ్యానించాడు.
కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలుత రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన అతడు.. సెలవు పొడిగించాలని బీసీసీఐని కోరడంతో.. బోర్డు అందుకు అంగీకరించింది.
మిగిలిన మూడు టెస్టులకూ దూరం
ఈ క్రమంలో మిగిలిన మూడు టెస్టులకు కోహ్లి సెలక్షన్‌కు అందుబాటులో లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని తెలిపింది. నిజానికి కోహ్లి మూడో టెస్టు నుంచైనా తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు.
ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే అని.. అలాంటిది ఈసారి మాత్రం తన ఆటను మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతకంటే ఎక్కువగా వారిని బాధిస్తున్న అంశం మరొకటి ఉంది.
కోహ్లి ఆడకపోవడం సిరీస్‌కే అవమానం లాంటిది
కోహ్లి ఈ సిరీస్‌కు దూరం కావడానికి గల అసలు కారణం ఇంతవరకు తెలియకపోవడంతో.. ఈ రన్‌మెషీన్‌కు ఏమై ఉంటుందా అని సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ తాజాగా IANS(వార్తా సంస్థ)తో మాట్లాడుతూ కోహ్లి గైర్హాజరీపై స్పందించాడు.
‘‘కోహ్లి లేకుండానే ఈ సిరీస్ జరగడం సిరీస్‌కే ఓ అవమానం లాంటిది. కోహ్లి నాణ్యమైన నైపుణ్యాలు గల బ్యాటర్. ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘం. అతడిలోని ఫైర్ ప్రత్యర్థులకూ మజాను అందిస్తుంది.
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ఏదేమైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోహ్లి జట్టులో లేకపోవడం యువ ఆటగాళ్లకు గొప్ప వరం లాంటిది. అతడి గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మున్ముందు మరిన్ని ఛాన్స్‌లు పొందే అవకాశం ఉంటుంది’’ అని ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులాడిన బ్రాడ్ 604 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment