అలాంటి వాడిని కాదు! ఆ విషయంలో నేనేం చేయలేను: శార్దూల్‌ ఠాకూర్‌ | Shardul Thakur: I Dont Play For My Place If Not Picked For World Cup Its | Sakshi
Sakshi News home page

Shardul Thakur: నేను అలాంటి వాడిని కాదు! అది వాళ్లిష్టం.. ఆ విషయంలో నేనేం చేయలేను: శార్దూల్‌ ఠాకూర్‌

Published Wed, Aug 2 2023 1:59 PM | Last Updated on Wed, Aug 2 2023 3:24 PM

Shardul Thakur: I Dont Play For My Place If Not Picked For World Cup Its - Sakshi

West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బార్బడోస్‌లో తొలి వన్డేలో విండీస్‌ ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(17) వికెట్‌ తన ఖాతాలో వేసుకున్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. అదే వేదికపై రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు.

వరల్డ్‌కప్‌ సన్నాహక సిరీస్‌లో..
ఇక ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్ల(4/37)తో చెలరేగాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 సన్నాహకంగా భావిస్తున్న సిరీస్‌లో ఈ అద్భుతంగా రాణించి సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురుకాగా శార్దూల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

8 వికెట్లు పడగొట్టి
మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఓ క్రికెటర్‌గా జట్టులో స్థానం కోసం మేము ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి మెరుగ్గా రాణిస్తాం.. మరికొన్నిసార్లు నిరాశ తప్పదు.

అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేనైతే నా కెరీర్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌ నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. జట్టులో స్థానం సంపాదించాలనే ఆలోచనతో ఉండే మనస్తత్వం కాదు నాది.

అది సెలక్టర్ల ఇష్టం
జట్టుకు ఉపయోగపడే విధంగా ఆడాలని మాత్రమే అనుకుంటాను. ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేస్తారో చేయరో అన్నది సెలక్టర్ల ఇష్టం. ఆ విషయంలో నేనైతే ఏమీచేయలేను. ముందుగా చెప్పినట్లు పరిస్థితులకు అనుగుణంగా జట్టును గెలిపించేలా ఆడటంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది’’ అని రైట్‌ ఆర్మ్‌ సీమర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చాడు. 

లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాను కాబట్టే
గత రెండేళ్లలో తాను జట్టులో రెగ్యులర్‌ సభ్యుడినయ్యానన్న ఈ మహారాష్ట్ర ఆల్‌రౌండర్‌.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం తనను కీలక ఆటగాళ్లలో ఒకడిగా మార్చిందన్నాడు. జట్టును గెలిపించే క్రమంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.​ ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచప్‌-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

చదవండి: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం కష్టం.. ఎప్పుడు, ఎక్కడైనా: సంజూ శాంసన్‌ 
విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement