
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు ఇరు జట్లకు షాక్ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ సందర్భంగా బ్రాడ్ గాయపడగా.. ప్రాక్టీస్ సెషన్‌లో శార్దూల్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ఇద్దరు పేసర్లు రెండో టెస్ట్ అడేది అనుమానమే. లార్డ్స్‌లో 150వ టెస్ట్ ఆడాల్సి ఉన్న బ్రాడ్.. జట్టుకు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్ జట్టుపై కూడా ప్రభావం చూపనుంది. సిరీస్ కీలక దశలో సీనియర్ బౌలర్ సేవలు కోల్పోవడం ఇంగ్లీష్ జట్టుకు మింగుడు పడని విషయమే. ఇప్పటికే ఆ జట్టు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది.
మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సేవలు కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. తొలి టెస్ట్‌లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ పిచ్ కూడా పేసర్లకు అనుకూలించనుండటంతో రెండో టెస్ట్‌లో అతని స్థానం దాదాపు ఖరారైంది. ఇలాంటి తరుణంలో గాయం కారణంగా అతను దూరం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో శార్దూల్ దూరమైతే అతని స్థానంలో అశ్విన్ లేదా పేస్ బౌలర్లు ఇషాంత్, ఉమేష్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. కాగా, తొలి టెస్ట్‌లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు ఆట మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.