Andrew Strauss Recalls Wif Words After Learning Devastating Cancer Diagnosis: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం దాగుంది. అతడి భార్య రూత్ లంగ్ క్యాన్సర్‌తో అర్ధంతరంగా తనువు చాలించింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా, వారి ముద్దుముచ్చట్లు పూర్తిగా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది.
భార్య పేరిట ఫౌండేషన్
భార్య జ్ఞాపకాలను మర్చిపోలేని స్ట్రాస్.. ఆమె పేరిట రూత్ స్ట్రాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం.
కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో జూన్ 29న మొదలు కానున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా రూత్‌కు నివాళిగా రెడ్ ఫర్ రూత్ డే జరుపనున్నారు.
ప్రేక్షకులు, వాలంటీర్లు తదితరులు ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునే నిమిత్తం నిధులు సేకరించనున్నారు.
ఇంతటి విషాదమా!
‘‘నేను ఎప్పుడైతే ఆ చేదువార్త విన్నానో అప్పుడు నా హృదయం ముక్కలైంది. నా మానసిక వ్యథను మాటల్లో వర్ణించలేను. మా జీవితాల్లో కోలుకోలేని షాక్ అది. అసలు మాకే ఎందుకిలా జరిగింది? ఇదసలు నిజమేనా? అంటూ నా మనసు పరిపరివిధాలుగా ఆలోచించింది.
కానీ రూత్ మాత్రం ఆది నుంచి ధైర్యంగానే ఉంది. నాకే ఎందుకిలా? అని తను బాధపడుతూ కూర్చోలేదు. ప్రతిరోజూ ఇలాగే ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉండేది. మహమ్మారి బారిన పడ్డా తను అలా ఎలా ఉండగలిగిందో నాకైతే అర్థం కాలేదు. క్యాన్సర్ సోకిందన్న వార్త వినగానే తను కూల్‌గా స్పందించింది. టీ తాగుతారా? అని అడిగింది.
చావుకు సిద్ధపడే
నిజంగా.. దురదృష్టం తనను వెంటాడింది. చావుకు మానసికంగా సిద్ధమైనా.. పిల్లల విషయంలో మాత్రం చాలా బాధపడేది. వాళ్ల ఎదుగుదల చూడలేకపోతున్నానే అని వేదన చెందేది. జీవితంలో తను చాలా సాధించాలనుకుంది. కానీ అర్ధంతరంగా జీవితం ముగించాల్సి వస్తుందని తెలిసి.. ముందుగానే అందుకు సిద్ధమైంది.
ఈ భూమ్మీద తనకు మిగిలిన రోజులను కుటుంబంతో సంతోషంగా గడపాలని నిశ్చయించుకుంది. తను మమ్మల్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోవడానికి ముందే మాకేం కావాలో అన్నీ అమర్చి పెట్టింది’’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తమ జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ మేరకు టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దివంగత భార్య రూత్ ఎంతో ధైర్యవంతురాలని, ఆమెను చాలా మిస్ అవుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా 2017లో తనకు క్యాన్సర్ సోకిందన్న విషయం తెలుసుకున్న రూత్.. ఆ మరుసటి ఏడాది తుదిశ్వాస విడిచింది. ఇక 2003లో ఆండ్రూ- రూత్ పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సామ్(2005), లుకా (2008) జన్మించారు. కాగా రూత్ చనిపోయిన తర్వాత ఆండ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
చదవండి: లేటు వయస్సులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న ఆటగాడు.. ఏకంగా కోహ్లి స్ధానానికే!
జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్
Comments
Please login to add a commentAdd a comment