IPL 2022: Sheldon Jackson Trends on Twitter Journalist Termed Overseas Player - Sakshi
Sakshi News home page

IPL 2022: సిగ్గుచేటు.. బయటోడికి, మనోడికి తేడా తెలియడం లేదా?

Published Wed, Mar 23 2022 5:42 PM | Last Updated on Wed, Mar 23 2022 7:38 PM

Sheldon Jackson Trends On Twitter Journalist Termed Overseas Player - Sakshi

కేకేఆర్‌ ఆటగాడు.. సౌరాష్ట్ర వికెట్‌ కీపర్‌ షెల్డన్‌ జాక్సన్‌ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. అదేంటి ఇంకా ఐపీఎల్‌ ప్రారంభం కాకముందే అలా ఎలా అని ఆశ్చర్యపోకండి. అతని పేరు మార్మోగిపోవడానికి కారణం ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ చేసిన పని. విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 15వ సీజన్‌ మరో మూడురోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ మీడియా చానెల్స్‌ ప్యానెల్‌ చర్చలు జరుపుతున్నాయి. వారి చర్చల్లో ఈసారి ఐపీఎల్‌ విజేతలుగా నిలిచే అవకాశం ఎవరికి ఉంది.. జట్టు బలబలాలు, ఆయా జట్ల గేమ్‌ స్ట్రాటజీ ఏంటనే దానిపై సీరియస్‌ చర్చలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒక మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్యానెల్‌లో కేకేఆర్‌ జట్టు చర్చకు వచ్చింది ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ అదే జట్టులోని షెల్డన్‌ జాక్సన్‌ను విదేశీ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. వాస్తవానికి షెల్డన్‌ జాక్సన్‌ పేరు విదేశీయుల పేరుకు దగ్గరగా ఉండడంతో సదరు జర్నలిస్ట్‌ అతను ఫారిన్‌ ప్లేయరేమోనని భావించాడు. షెల్డన్‌ జాక్సన్‌ గురించి మాట్లాడేటప్పుడు సదరు జర్నలిస్ట్‌ విదేశీ ఆటగాడిగానే సంభోదించాడు. పక్కనున్న మిగతావారు కూడా అతనికి వంత పాడారు.

ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా..చర్చ జరిపిన ప్యానెల్‌ను మొత్తం ఎండగట్టారు. విదేశీ ఆటగాడికి.. మనోడికి తేడా తెలియడం లేదా.. క్రికెట్‌పై సరైన అవగాహన లేని ప్రతీఒక్కరు మీటింగ్‌లు పెడుతున్నారు.. వాస్తవం ఏంటనేది తెలసుకొని ప్యానెల్‌ చర్చలు నిర్వహించండి.. ఇది నిజంగా సిగ్గుచేటు.. అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే చివరలో అసలు విషయం తెలుసుకున్న జర్నలిస్ట్‌ సహా మిగతా సభ్యులు తాము చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. 

గుజరాత్‌కు చెందిన షెల్డన్‌ జాక్సన్‌ 2013లో ఆర్‌సీబీ తరపున తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. కానీ ఆ జట్టుకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఆ తర్వాత 2017 నుంచి షెల్డన్‌ జాక్సన్‌ కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే జరిగిన మెగావేలంలో షెల్డన్‌ జాక్సన్‌ను కేకేఆర్‌ మరోసారి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు చేశాడు. ఇక రైల్వే జట్టుకు ఆడడం ద్వారా షెల్డన్‌ జాక్సన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 79 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లాడి  8 సెంచరీలు.. 12 అర్థసెంచరీల సాయంతో 2346 పరుగులు చేశాడు. ఇక 62 టి20 మ్యాచ్‌ల్లో 1511 పరుగులు సాధించాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement