Photo: IPL Twitter
శివమ్ దూబే గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్ తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. పవర్ హిట్టర్‌గా పేరు పొందిన శివమ్ దూబే ఈ సీజన్‌లోనూ మరింత రాటుదేలాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన దూబే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది మొదలు సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ సీజన్‌లో సీఎస్‌కే తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా దూబే నిలిచాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో దూబే 12 ఫోర్లు, 33 సిక్సర్లతో 385 పరుగులు చేశాడు. ఫోర్లు కొట్టడం కంటే సిక్సర్లు కొట్టడమే ఇష్టమని శివమ్ దూబే పేర్కొన్నాడు. అయితే దూబే బాదుడును తండ్రి రాజేశ్ దూబే ముందే ఊహించాడట. దూబే నాలుగేళ్ల వయసులోనే వాడి హిట్టింగ్ పవరేంటో తెలిసిందని రాజేశ్ దూబే చెప్పుకొచ్చాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజేశ్ దూబే మాట్లాడుతూ.. ''వాడికి(శివమ్ దూబే) నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే హిట్టింగ్ పవర్ ఏంటో చూశాను. టెన్నిస్ బంతి పడడమే ఆలస్యం ముందుకొచ్చి బంతిని కసితీరా బాదేవాడు. అప్పుడే నిర్ణయించుకున్నా వాడు క్రికెటర్ అవ్వాలని. అందుకోసం ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేయించేవాడిని. అలా 20 నుంచి 24 ఏళ్ల పాటు వాడి తొలి కోచ్‌ను అయ్యా.
స్వయానా నేను రెజ్లర్ కావడం వాడి శిక్షణకు కాస్త ఉపయోగపడింది. ఇక ప్రాక్టీస్ తర్వాత ఊరిలోనే ప్రత్యేకంగా తయారు చేసిన ఆముదం నూనెతో గంటన్నర పాటు దూబే శరీరానికి మసాజ్ చేసేవాడిని. అండర్-14 వెళ్లేవరకు దూబేకు ఓనమాలు నేర్పిన గురువునయ్యాను. ఆ తర్వాత వాడు క్రమంగా ఎదిగాడు. ఇంటికొచ్చిన ప్రతీసారి కూడా వాడితో నేను క్రికెట్ ఆడేవాడిని. బ్యాటింగ్‌లో లోపాలు ఉంటే గుర్తించి చెప్పేవాడిని.
ఆరు అడుగులకు పైగా ఎదిగిన వాడు బ్యాట్ పట్టి సిక్సర్లు కొడితే మైదానం బయటే పడేవి. పవర్ హిట్టింగ్ అనేది వాడికి చిన్నప్పటి నుంచే ఇష్టం. ఐపీఎల్‌లో వాడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. నా దృష్టిలో దేశానికి ఆడడం గొప్ప అచీవ్‌మెంట్. అది దూబే సాధించాడు. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు టీమిండియా తరపున 14 మ్యాచ్‌లాడడం గొప్ప విషయం. అయితే ఆ తర్వాత తుది జట్టులో చోటు కోల్పోవడం బాధించినా.. ఈ సీజన్‌లో దూబే చేస్తున్న ప్రదర్శను చూసిన తర్వాత మళ్లీ టీమిండియాలో అడుగుపెడతాడని నమ్మకం వచ్చింది.'' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే
కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా
Comments
Please login to add a commentAdd a comment