ఇస్లామాబాద్: ‘‘నిజానికి నిన్న రాత్రి మ్యాచ్ చూడలేకపోయాను. అందుకే ఈరోజు ఉదయం నిద్రలేవగానే టీవీ ఆన్ చేశాను. బోర్డు మీద టీమిండియా స్కోరు 369 అని ఉందనుకున్నా. వెంటనే కళ్లు నులుముకుని జాగ్రత్తగా మరోసారి పరిశీలించా. అది 369 కాదు 36/9. ఒక రిటైర్డ్ హర్ట్. పూడ్చలేని నష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్ తీరు ఇలా అయిపోయింది’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత జట్టు ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. చెత్త రికార్డు నమోదు చేసిన కారణంగా విమర్శలు ఎదుర్కొనేందుకు కోహ్లి సేన సిద్ధంగా ఉండాలని సూచించాడు.
ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడం గురించి మాట్లాడుతూ.. ‘‘36 పరుగులకే ఆలౌట్! ఘోరమైన ప్రదర్శన ఇది. అయితే ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. ఎట్టకేలకు వాళ్లు మా రికార్డును బ్రేక్ చేశారు. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఇలాంటి ప్రదర్శన కారణంగా బాణాల్లా దూసుకువచ్చే విమర్శలను భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీ వంతు. మొత్తానికి ఇదొక బ్యాడ్ న్యూస్’’ అని రావల్సిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లి సేన ఘోర పరాజయం మూటగట్టుకుంది. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టు చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ఆటలో భాగంగా 21.2 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా 36 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. (చదవండి: ఆసీస్ బౌలింగ్ సూపర్బ్ : గావస్కర్)
ఆనాడు పాక్ చెత్త రికార్డు
ఇక 27 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లు చేజార్చుకుని ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. దీంతో కోహ్లి సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాక్ విషయానికొస్తే.. 2013లో జోహన్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 49 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి విమర్శలపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment