అరివీర భయంకరమైన ఫామ్‌లో అయ్యర్‌.. టీమిండియాలో చోటు పక్కా..! | Shreyas Iyer Is Phenomenal In Every Format In This Season, His Spot In Team India Will Be Sure Says Reports | Sakshi
Sakshi News home page

అరివీర భయంకరమైన ఫామ్‌లో అయ్యర్‌.. టీమిండియాలో చోటు పక్కా..!

Published Wed, Jan 8 2025 4:59 PM | Last Updated on Wed, Jan 8 2025 6:17 PM

Shreyas Iyer Is Phenomenal In Every Format In This Season, His Spot In Team India Will Be Sure Says Reports

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్‌ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్‌ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్‌.. దేశవాలీ క్రికెట్‌లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్‌ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్‌ ఆడాడు. 

శ్రేయస్‌ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్‌రేట్‌తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో శ్రేయస్‌ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్‌టీలో శ్రేయస్‌ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. 

ఈ టోర్నీలో శ్రేయస్‌ యావరేజ్‌ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్‌ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్‌రేట్‌ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్‌ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్‌ ఇదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు తిరుగే ఉండదు. 

శ్రేయస్‌ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ ఆడాడు. శ్రేయస్‌ తన చివరి టీ20ను 2023 డిసెంబర్‌లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ శ్రేయస్‌కు చివరి టీ20. టెస్ట్‌ల విషయానికొస్తే..శ్రేయస్‌ టెస్ట్‌ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ (న్యూజిలాండ్‌తో) ఆడిన శ్రేయస్‌.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ (ఇంగ్లండ్‌) ఆడాడు. 

33 ఏళ్ల శ్రేయస్‌ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్‌తో పరిమత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్‌కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్‌ రాకతో మిడిలార్డర్‌లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. 

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే శ్రేయస్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్‌లో మొదటి నుంచి శ్రేయస్‌కు తిరుగులేదు. ఈ ఫార్మాట్‌లో అతను 62 మ్యాచ్‌లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్‌రేట్‌తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

టీ20ల్లోనూ శ్రేయస్‌కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్‌లో శ్రేయస్‌ 51 మ్యాచ్‌లు ఆడి 136.12 స్ట్రయిక్‌రేట్‌తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్‌.. 14 మ్యాచ్‌ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా​)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)

ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్‌)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్‌)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్‌)

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత షెడ్యూల్‌..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్‌ (దుబాయ్‌)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్‌  (దుబాయ్‌)
మార్చి 2- న్యూజిలాండ్‌ (దుబాయ్‌)

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌.. పాక్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్‌-ఏలో ఉంది. గ్రూప్‌ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్‌ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్‌-ఏ టాపర్‌, గ్రూప్‌-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్‌-బి టాపర్‌, గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement