రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో తొలుత మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఒడిషాపై శ్రేయస్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ శ్రేయస్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది 15వ సెంచరీ.
శ్రేయస్ అటాకింగ్ సెంచరీతో సత్తా చాటడంతో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితికి చేరింది. 72 ఓవర్ల అనంతరం ముంబై 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. శ్రేయస్‌కు జతగా సిద్దేశ్ లాడ్ (91) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రఘువంశీ 124 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 18 పరుగులకు వెనుదిరగగా.. కెప్టెన్ అజింక్య రహానే డకౌటయ్యాడు. ఒడిషా బౌలర్లలో బిప్లబ్ సమంత్రే రెండు వికెట్లు పడగొట్టగా.. సూర్యకాంత్ ప్రధాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, శ్రేయస్ అయ్యర్ తిరిగి టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. ఆతర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో రీ ఎంట్రీనే లక్ష్యంగా శ్రేయస్ రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. శ్రేయస్ వరుస సెంచరీలు చేసి సెలెక్టర్లకు సవాలు విసిరాడు. టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా కనబడుతున్న తరుణంలో శ్రేయస్ సెలెక్టర్ల పాలిట ఆశాకిరణంగా కనిపిస్తుంటాడు.
మరోవైపు శ్రేయస్‌ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఇటీవలే వదిలించుకున్న విషయం తెలిసిందే. శ్రేయస్ కేకేఆర్‌ను గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిబెట్టినా అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నవంబర్ 24, 25 తేదీల్లో జెద్దా వేదికగా జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ పాల్గొంటాడు. శ్రేయస్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. శ్రేయస్‌తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది భారతీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment