కేకేఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్‌ సోదరి! | Shreyas Iyer Sister Clarification After Online Abuse From KKR Fans | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్‌ సోదరి!

Apr 8 2026 9:29 AM | Updated on Apr 8 2026 9:39 AM

Shreyas Iyer Sister Clarification After Online Abuse From KKR Fans

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో కేకేఆర్‌కు ఘ‌న‌మైన రికార్డు ఉంది. మూడుసార్లు చాంపియ‌న్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మాత్రం విజ‌యం కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురుచూడాల్సి వ‌స్తోంది. ఒక‌సారి భారీ స్కోరు చేసి కూడా గెల‌వ‌క‌పోవ‌డం, మ‌రొక‌సారి త‌క్కువ స్కోరుకే ఆలౌట‌య్యి ప‌రాజ‌యం మూటగ‌ట్టుకుంది. 

ముచ్చ‌ట‌గా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి శుభారంభం చేయాలనుకున్న కేకేఆర్ ఆశ‌ల‌పై వ‌రుణుడు అమాంతం నీళ్లు చ‌ల్లాడు.  సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఒక బంతి కూడా పడ‌కుండానే ర‌ద్ద‌వ్వ‌డంతో ఇరుజ‌ట్ల‌కు చెరొక పాయింట్ కేటాయించారు. 

అయితే మూడుసార్లు ఐపీఎల్ చాంపియ‌న్ అయిన కేకేఆర్‌ను ఉద్దేశించి  పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సోద‌రి శ్రేష్ఠ అయ్య‌ర్ పెట్టిన పోస్టు వివాదాస్ప‌దంగా మారింది.  కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్‌స్టాగ్రామ్‌  వేదికగా శ్రేష్ట్ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది.  

'మా పంజాబీల‌ మనసు చాలా పెద్దది. అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చేశాం. బ‌తికి బ‌ట్ట‌క‌ట్టండి’ అని పంజాబీలో వ్యాఖ్యానిస్తూ డ్యాన్సులు చేసింది. అయితే శ్రేష్ఠ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రేష్ఠ వ్యాఖ్య‌ల‌పై కేకేఆర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘మీ అన్న కెప్టెన్సీలోనే కేకేఆర్ విజేత‌గా నిలిచింద‌న్న సంగ‌తి మ‌రిచిపోయారా! అంటూ ట్రోల్ చేశారు.  

మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్‌కు పోయింది. దాంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే శ్రేష్ట అయ్యర్ కేకేఆర్‌ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది.

తాజాగా శ్రేష్ఠ అయ్యర్‌ తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చింది. ‘నేను ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. ఫన్నీ తరహాలోనే పెట్టాను. ఆటను ఆటగానే చూడండి. నాకు ఏ జట్టుపైన ద్వేషం లేదు. ప్రతి ఒక్కరు దీనిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. ఎవరినీ ట్రోల్ చేయాలనుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని మీరు భూతద్ధంలో నుంచి చూస్తున్నారు. దయచేసి శాంతించండి’ అని పేర్కొన్నారు.

కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచు కుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు.

చదవండి: ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement