టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కొటక్‌ | Sitanshu Kotak Appointed As Team India Batting Coach Ahead Of England T20Is, Know About More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కొటక్‌

Published Fri, Jan 17 2025 6:55 AM | Last Updated on Fri, Jan 17 2025 1:56 PM

Sitanshu Kotak Appointed As Team India Batting Coach

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కోచింగ్‌ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్‌ సితాన్షు కొటక్‌ టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్‌ నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాన్షు 2019 నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్‌ కోచ్‌గా పని చేస్తున్నాడు. భారత ‘ఎ’ జట్టు పర్యటనల్లో పలు మార్లు కోచ్‌గా పని చేసిన సితాన్షు... సీనియర్‌ టీమ్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వెళ్లిన సిరీస్‌లలో అతనికి అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. సితాన్షు లెవల్‌–3 క్వాలిఫైడ్‌ కోచ్‌ కూడా. 

తాజా ఎంపికతో భారత టీమ్‌లో అసిస్టెంట్‌ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండగా ...మోర్నీ మోర్కెల్‌ (బౌలింగ్‌), టి.దిలీప్‌ (ఫీల్డింగ్‌)లతో పాటు అభిషేక్‌క్‌ నాయర్, టెన్‌ డస్కటేలకు కూడా ఇప్పటికే అసిస్టెంట్‌ కోచ్‌ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. 

దాంతో మన బ్యాటర్లను సాంకేతికంగా మరింత మెరుగుపర్చే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్‌లో సౌరాష్ట్ర టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు 130 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లు కూడా ఆడిన సితాన్షు 42.23 సగటుతో 3083 పరుగులు సాధించాడు.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement