ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాడు, ఆ జట్టు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తన ఆరాధ్య ఆటగాడు విరాట్ కోహ్లిని ఫాలో అవుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన జద్రాన్.. కోహ్లి స్టైల్‌లోనే సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ శతకం సాధించిన జద్రాన్.. కోహ్లి తరహాలో సెంచరీ పూర్తయ్యాక మెడలో ఉన్న గొలుసును ముద్దాడాడు. జద్రాన్ పరిమిత ఓవర్లలో కోహ్లిలానే 18 నంబర్ జెర్సీని ధరిస్తాడు.
ఈ మ్యాచ్‌లో జద్రాన్ చేసిన సెంచరీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది కేవలం నాలుగో సెంచరీ మాత్రమే. జద్రాన్‌కు ముందు హష్మతుల్లా షాహీది (200 నాటౌట్), ఆస్గర్ అఫ్ఘాన్ (164), రహ్మత్ షా (102) మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్ సెంచరీలు చేశారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 241 పరుగులు వెనుకపడి ఉన్నప్పుడు) జద్రాన్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 217 పరుగులు ఎదుర్కొన్న జద్రాన్ 11 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
జద్రాన్‌కు జతగా రహ్మత్ షా (46) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌తో జద్రాన్ బాబయ్ నూర్ అలీ జద్రాన్ (31, 47) టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఏకంగా నలుగురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేశాడు.
కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 2న మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండీమల్ (107) సెంచరీలతో చెలరేగగా.. కరుణరత్నే అర్దసెంచరీతో (77) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment