Asia Cup 2022 SL Vs Ban- Bangladesh Knocked Out Of Tourney: ఆసియా కప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసింది. దుబాయ్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బృందం ఓటమి పాలైంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్‌తో పాటు లంక సూపర్-4కు అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓటమిపై స్పందించాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పరాజయంతో ఇంటిబాట పట్టినందుకు చింతిస్తున్నామంటూ అభిమానులను క్షమాపణ కోరాడు.
అదరగొట్టిన కుశాల్, దసున్
గురువారం(సెప్టెంబరు 1) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫిఫ్ హొసేన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభం అందించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో లంక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దసున్ షనక 33 బంతుల్లో 45 పరుగులు చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు.
కొంప ముంచిన ఇబాదత్!
కానీ.. ఆ తర్వాత వనిందు హసరంగ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో గెలుపు కోసం చివరి 2 ఓవర్లలో లంకకు 25 పరుగులు అవసరమయ్యాయి. దీంతో బంగ్లా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది.
అయితే 19వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో లంక గెలుపు సమీకరణం 8 పరుగులకు చేరగా.. అసిత ఫెర్నాండో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వైడ్‌లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లాకు చేదు అనుభవం తప్పలేదు.
మా ఓటమికి కారణం అదే!
ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘చెత్త బౌలింగ్ కారణంగా ముఖ్యంగా డెత్ ఓవర్లలో విఫలమైనందున భారీ మూల్యం చెల్లించాం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి చేతిలో నాలుగు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా బౌలింగ్ అధ్వాన్నంగా సాగింది.
నిజానికి, శ్రీలంక బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దసున్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలని అనుకున్నాం. కానీ.. మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. గత ఆర్నెళ్లుగా మా జట్టు ప్రదర్శన అస్సలు బాగుండటం లేదు.
అయితే, గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఏదేమైనా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పకతప్పదు. ఎక్కడివెళ్లినా మా మీద మీ ప్రేమ తగ్గడం లేదు. అయితే, మేము మిమ్మల్ని నిరాశ పరుస్తున్నాం. సారీ’’ అని పేర్కొన్నాడు.
చదవండి: Asia cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు'
Comments
Please login to add a commentAdd a comment