
మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 పరుగుల తేడాతో శ్రీలంకపై కివీస్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష్య చేధనలో లంకకు ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన కివీ పేసర్ జాకబ్ ఢఫీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
కుశాల్ మెండిస్(46),కుశాల్ పెరీరా(0), కమిందు మెండిస్(0)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు మలుపుతిప్పాడు. ఆ తర్వాత లంకేయులు తిరిగి కోలుకోలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
అయితే లంక ఓటమిపాలైనప్పటికి పాథుమ్ నిస్సాంక మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోల్క్స్, హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు.
అదరగొట్టిన మిచెల్, బ్రేస్‌వెల్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(62), బ్రేస్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, థీక్షణ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో డిసెంబర్ 30న జరగనుంది.
చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment