Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! | Is Smith Told Kohli He is Retiring Before Official Announcement Heartwarming | Sakshi
Sakshi News home page

Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!

Published Thu, Mar 6 2025 10:41 AM | Last Updated on Thu, Mar 6 2025 11:37 AM

Is Smith Told Kohli He is Retiring Before Official Announcement Heartwarming

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌(Steve Smith) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. తన అకస్మాత్‌ నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఆసీస్‌ పరాజయం అనంతరం స్మిత్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్‌ నుంచి తప్పుకొన్నా... టెస్టులు, టీ20ల్లో కొనసాగాలనుకుంటున్నట్లు 35 ఏళ్ల స్మిత్‌ వెల్లడించాడు.

అయితే, స్మిత్‌ తన రిటైర్మెంట్‌(ODI Retirement) నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే కంటే ముందే.. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli)కి ఈ విషయం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్లో ఆసీస్‌పై భారత్‌ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న వేళ స్మిత​- కోహ్లి ముఖాలు దిగాలుగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇదే చివరి మ్యాచా?
ఈ క్రమంలో.. ‘‘ఇదే చివరి మ్యాచా?’’ అని కోహ్లి అడుగగా.. ‘అవును’ అంటూ స్మిత్‌ సమాధానమిచ్చాడని.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులే అయినా కోహ్లి- స్మిత్‌ మధ్య వ్యక్తిగతంగా ఉన్న స్నేహబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు చిలిపిగా వ్యవహరించినా క్రీడా స్ఫూర్తిని చాటడంలో.. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వడంలో కింగ్‌కు మరెవరూ సాటిరారని కోహ్లిని కొనియాడుతున్నారు.

నాడు స్మిత్‌కు కోహ్లి మద్దతు
కాగా నవతరం ఫ్యాబ్‌ ఫోర్‌(కోహ్లి, విలియమ్సన్‌, స్మిత్‌, రూట్‌)లో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా తలపడే ఈ ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంలోనూ ముందే ఉంటారు. కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని తాను చూడలేదని.. అతడంటే తనకు ఎంతో గౌరవమని స్మిత్‌ పలు సందర్భాల్లో వెల్లడించాడు.

ఇక వరల్డ్‌ కప్-2019‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ సమయంలో స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్‌’ అంటూ గేళి చేయగా.. బ్యాటింగ్‌ చేస్తున్న  కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని  వారించాడు. అంతేకాదు.. స్మిత్‌ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. దీంతో ప్రేక్షకులు కూడా సంయమనం పాటించారు.

5,800 పరుగులు
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... చాంపియన్స్‌ ట్రోఫీలో అతడి స్థానంలో స్మిత్‌ కంగారూ జట్టుకు సారథ్యం వహించాడు. 2010లో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్మిత్‌... కెరీర్‌లో ఇప్పటి వరకు 170 మ్యాచ్‌లాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.

 గొప్ప ప్రయాణం
ఇక 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా  జట్టులో కీలక సభ్యుడైన స్మిత్‌... బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌... ఆ తర్వాత నెమ్మదిగా ఆల్‌రౌండర్‌గా... ఆపై టాపార్డర్‌ బ్యాటర్‌గా... అటు నుంచి స్టార్‌ ప్లేయర్‌గా ఎదిగాడు. 

‘ఇది చాలా గొప్ప ప్రయాణం. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. ఈ ఫార్మాట్‌లో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలవడం ఎప్పటికీ మరవలేను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

అందుకే రిటైర్‌ అయ్యాను
కాగా 2027 వన్డే ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 

‘ఇంకా నాలో చాలా క్రికెట్‌ మిగిలే ఉంది. అయితే మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో జట్టును సిద్ధం చేసుకునేందుకు మేనేజ్‌మెంట్‌కు సమయం దక్కుతుంది. టెస్టులు, టీ20ల్లో అవకాశం కల్పిస్తే తప్పక జట్టు విజయాల కోసం కృషి చేస్తా’ అని స్మిత్‌ అన్నాడు. 

చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్‌ స్మిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement