ఎమర్జింగ్ ఆసియా కప్-2024 నాటి మ్యాచ్‌లో భారత్- పాక్ కెప్టెన్లు(PC: X)
సోనీ చేతికి ‘ఆసియా’ క్రికెట్ హక్కులు
భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ (ఎస్పీఎన్‌ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్‌లను సోనీ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.
ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది.
పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment