ఆగస్టు 15, 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవనుంది. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఒక చారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ నిర్వహించాలంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బీసీసీఐని సంప్రదించింది.
కేంద్ర ప్రతిపాదనను ఒప్పుకున్న బీసీసీఐ ఆగస్టు 22న భారత్ ఎలెవెన్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. కాగా బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మొదట చారిటీ మ్యాచ్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. దీనితో పాటు లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లోనూ ఆడడం లేదని స్పష్టం చేశాడు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు.. ఆపరేషనల్ కార్యక్రమాలు.. బిజీ షెడ్యూల్ కారణంగానే దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.
కానీ తాజాగా దాదా తన మనసు మార్చుకున్నాడు. బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. శుక్రవారం జిమ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీ అందుకు సంబంధించిన ఫోటోలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నా. కసరత్తులు ఆరంభించా.. ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాలి. అలాగే మహిళా సాధికారత(Women Empowerment) కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ ఆడబోతున్నా' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న మ్యాచ్‌లో తాను భాగం కావాలనే ఉద్దేశంతోనే గంగూలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉంటూనే టీమిండియా తరపున చారిటీ మ్యాచ్ ఆడనున్న తొలి క్రికెటర్‌గా గంగూలీ చరిత్రకెక్కనున్నాడు. ఆగస్టు 22న జరగనున్న ఈ మ్యాచ్‌కు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. భారత్ ఎలెవెన్ పెద్ద సమస్య కాకపోయినా.. రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవెన్ జాబితా ఎంపిక చేయడం కష్టమే. మొత్తం 13-14 మంది ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఇక క్రికెట్‌తో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో డిజిటల్ ఫోటోగ్రఫీ కంటెస్ట్, మెంటార్‌షిప్ టు యంగ్ ఆథర్స్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించనున్నారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్
బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్ ఆడనున్న గంగూలీ.. పనిలో పనిగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్(ఎల్‌ఎల్‌సీ)లో ఆడేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహిళా సాధికారత కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో 2015 నుంచి గంగూలీ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. అయితే ఈసారి బిజీ షెడ్యూల్ కారణంగా మొదట దూరంగా ఉండాలనుకున్నప్పటికి తాజాగా ఆడాలని నిశ్చయించుకున్నాడు. కరోనా తర్వాత రెండుసార్లు క్లోజ్ డోర్స్‌లోనే లీగ్ జరిగింది. ఈసారి మాత్రం ప్రేక్షకులను అనుమతించనున్న నేపథ్యంలో ఎల్‌ఎల్‌సీకి మరింత కళ వచ్చింది.
గంగూలీ ఆడేందుకు ఒప్పుకోవడం సంతోషాన్ని కలిగించిందని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో.. సహ వ్యవస్థాపకుడు రామన్ రహెజా తెలిపాడు. ''ఒక లెజెండ్ ఎప్పుడు లెజెండ్‌గానే ఉంటాడు. క్రికెట్ కోసం దాదా ఎప్పుడు అండగా నిలబడి ఉంటాడు. ఈసారి నిర్వహించబోయే చారిటీ మ్యాచ్‌లో దాదా పాల్గొంటాడు. అతని ఐకానిక్ షాట్లు చూసేందుకు మేమంతా ఎదురుచూస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం..
Comments
Please login to add a commentAdd a comment