నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సంజూ శాంసన్ 0, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తలో 4, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత్ ఆదిలో విజయవంతమైంది. వరుణ్ చక్రవర్తి (4-0-17-5) దెబ్బకు సౌతాఫ్రికా ఓ దశలో మరో ఓటమి మూటగట్టుకునేలా కనిపించింది. అయితే ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్) పట్టుదలగా ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు.
19 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టబ్స్, కొయెట్జీతో పాటు ర్యాన్ రికెల్టన్ (13), రీజా హెండ్రిక్స్ (24) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవరి ఐదు, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment