దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్‌కు వన్డే సిరీస్‌లోనూ ఊరట లభించలేదు. దానికి కొనసాగింపుగానా అన్నట్లు తొలి మ్యాచ్‌లో ఓటమితో సిరీస్‌ను మొదలు పెట్టింది. పెద్దగా ప్రభావం చూపని బౌలింగ్‌తో సఫారీకి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన టీమిండియా... ఆ తర్వాత బ్యాటర్ల వైఫల్యంతో సునాయాసంగా పరాజయాన్ని ఆహ్వానించింది.
IND vs SA, 1st ODI: భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇదే మైదానంలో రేపు రెండో వన్డే జరుగుతుంది.
భారీ భాగస్వామ్యం...
బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో ఆరంభంలోనే జేన్‌మన్ మలాన్ (6) వికెట్ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. తొలి పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత డి కాక్ (27), మార్క్‌రమ్ (4)లను పది పరుగుల వ్యవధిలో అవుట్ చేసి భారత్ మళ్లీ దెబ్బ కొట్టింది. అయితే ఈ దశలో బవుమా, డసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. బవుమా నెమ్మదిగా ఆడినా, డసెన్ తన దూకుడుతో లెక్క సరి చేశాడు. ఆపై భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరు భారీ స్కోరుకు బాటలు వేశారు. శార్దుల్ ఓవర్లో సింగిల్ తీసి 133 బంతుల్లో బవుమా కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 83 బంతుల్లో డసెన్ కూడా తన రెండో శతకాన్ని అందుకున్నాడు. ఎట్టకేలకు 49వ ఓవర్లో బవుమాను అవుట్ చేసి బుమ్రా ఈ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు.
మిడిలార్డర్ విఫలం...
కెప్టెన్ రాహుల్ (12) పార్ట్‌టైమర్ మార్క్‌రమ్‌కు వికెట్ అప్పగించినా... ధావన్, కోహ్లి భాగస్వామ్యంలో జట్టు ఇన్నింగ్స్ చక్కగా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో కోహ్లి ఎప్పటిలాగే తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 17 ఓవర్లలో 92 పరుగులు జత చేశారు. అయితే ధావన్ అవుట్‌తో ఒక్కసారిగా జట్టు పతనం ప్రారంభమైంది. 50 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి దిశగా సాగింది. రిషభ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేశ్ అయ్యర్ (2) విఫలం కావడంతో లక్ష్య ఛేదన అసాధ్యంగా మారిపోయింది. చివర్లో శార్దుల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది.
వెంకటేశ్ @242
మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ రాజశేఖరన్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 242వ ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.
సచిన్‌ను దాటిన కోహ్లి...
ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు తొమ్మిది పరుగుల వద్ద విరాట్ కోహ్లి (5,108) విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్ (5,065) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment