గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): వెస్టిండీస్ గడ్డపై దక్షిణాఫ్రికా నాలుగోసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం నాలుగోరోజే ముగిసిన చివరిదైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 158 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. 324 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 58.3 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కీరన్ పావెల్ (51; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో గెలిచింది.
సోమవారం ఆట నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 15/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (5/36) ‘హ్యాట్రిక్’తో దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్లోని మూడు, నాలుగు, ఐదో బంతులపై విండీస్ బ్యాట్స్‌మెన్ కీరన్ పావెల్, జేసన్ హోల్డర్, జాషువా డసిల్వాలను కేశవ్ మహరాజ్ అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా టెస్టుల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా... జెఫ్ గ్రిఫిన్ (1960లో ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో) తర్వాత ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా కేశవ్ మహరాజ్ గుర్తింపు పొందాడు.
ఇప్పటివరకు వెస్టిండీస్‌లో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఆడేందుకు ఐదుసార్లు పర్యటించింది. తొలిసారి 1992లో వెస్టిండీస్‌కు సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా... 2001, 2005, 2010, 2021లలో సిరీస్‌ను గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment