Sreesanth Retirement: క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు రెండ్రోజుల (మార్చి 9న) కిందట ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్ శాంతకుమరన్ శ్రీశాంత్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్ గురించి తన రంజీ జట్టు కేరళకు ముందే సమాచారమందించినా పట్టించుకోలేదని, ఆరేళ్లపాటు టీమిండియాకు ఆడిన ఆటగాడికి కనీస మర్యాదగా వీడ్కోలు ఉంటుందని ఆశించానని, అయితే కొన్ని శక్తుల వల్ల తాను అందుకు కూడా నోచుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి కేరళ జట్టు యాజమాన్యానికి ముందే సమాచారమిచ్చినా, గుజరాత్‌తో మ్యాచ్‌లో నన్ను ఆడించలేదని వాపోయాడు. ఈ మేరకు ఓ స్థానిక టీవీ ఛానెల్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
కాగా, ప్రస్తుత రంజీ సీజన్‌లో భాగంగా మార్చి 9న కేరళ-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆడి, ఆటకు వీడ్కోలు పలకాలని శ్రీశాంత్ భావించాడు. అయితే శ్రీ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోని కేరళ జట్టు యాజమాన్యం అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే బంతిని అందుకున్న శ్రీశాంత్.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఓ మ్యాచ్ ఆడాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన శ్రీశాంత్.. భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment