
నితీశ్ కుమార్ రెడ్డి (PC: BCCI)
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.
జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.
బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.
ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.
ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు.
NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥
IPL salary - 20 Lakhs.
APL salary - 15.6 Lakhs.
His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024